* తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం తన జీవిత కాలం పోరాడిన అంశాల స్వామి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సామాజిక సమస్యగా మారిన ఫ్లోరోసిస్ పేరు గుర్తుకు రాగానే తక్షణమే గుర్తుకు వచ్చే పేరు అంశాల స్వామి అని సీఎం గుర్తుకు చేసుకున్నారు. మానవీయ కోణాన్ని తట్టి లేపుతూ తెలంగాణ ఉద్యమంలో అంశాల స్వామి చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. స్వరాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా, ఫ్లోరోసిస్ రహిత శుద్ధి చేసిన స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే దృఢ సంకల్పానికి, ప్లోరోసిస్ బాధితులైన అంశాల స్వామి వంటి వారే ప్రేరణగా నిలిచారని సీఎం తెలిపారు. అంశాల స్వామి మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేసారు. వారి కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































