నవతరం

తెలుగు దినపత్రిక

కరువైన ప్రభుత్వ విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ

– అమలు కాని విద్యా హక్కు చట్టం
– ఆగమవుతున్న బాల్యం
– అక్షరాలు నేర్వని పసివాళ్లు
– తల్లిదండ్రులతో పాటే పనుల్లోకి
– ఆర్థిక ఇబ్బందులే అసలు కారణం
– చట్టాలు ఉన్నా అమలు చేసే అధికారులు కరువు

పలక, బలపం పట్టాల్సిన చిట్టి చేతులు వారి యజమానులు చెప్పే పనులు చేస్తున్నారు.  పశువులను మేపే కర్రను చేతపట్టి తమ బతుకులకు రిపేర్లు చేసుకుంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించుకోలేక పోవడం మనందరికీ సిగ్గుచేటే. ప్రభుత్వం పలు చట్టాలు తీసుకువచ్చి మార్పు తీసుకువస్తోంది. బాల కార్మిక వ్యవస్థ పూర్తిగా రూపు మాసిపోలేదన్న దానికి నిదర్శనంగా నిలుస్తోంది. అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుని పసి వయస్సులో చదువుకు దూరమై పనులు చేస్తున్న బాలలను గుర్తించి వారి జీవితాల్లో వెలుగులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మేడ్చల్: బాలకార్మికులు అనే ‘పదం రోజువారి, నిరంతర శ్రామికులుగా పనిచేసే బాలలను సూచిస్తోంది. నిర్దిష్ట వయస్సులోపల ఉన్న బాలలను పనిలోకి తీసుకోవడానికి యజమానులకు అనుమతి లేదు. కనీస వయస్సు అనేది దేశం, పనిని బట్టి మారుతుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ 1973లో చేసిన కనీస వయస్సు ఒప్పందాన్ని దేశాలు ఆమోదించి 14-16 ఏండ్ల మధ్య కనీస వయసు పరిమితిని విధించాయి. కానీ అది ఎక్కడా అమలు కావడంలేదు. ఇటుకబట్టీల్లో చిన్నారుల బాల్యం బుగ్గిపాలవుతోంది. పలకా, బలపం చేతబట్టి అక్షరాలు దిద్దాల్సిన బాల్యం నల్లమట్టిని ఇటుకలుగా చేసే పనిలో మగ్గిపోతోంది. విద్య ద్వారా ఉత్తమ భవిష్యత్ను అందుకోవాలని వారు ఆశించినా, ఆర్థిక స్థితిగతులలో కూరుకుపోయి బడికి దూరమైపోతున్నారు. బతుకు భారాన్ని అతి పిన్న వయస్సులోనే మోయాల్సిన పరిస్థితి నెలకొంది. వారికి భవిష్యత్ అంటే ఏ పూటకాపూట కడుపు నింపుకోవటమే. పాఠశాలకు వెళ్లాల్సిన వారు బాల కార్మికులుగా అవతరిస్తున్నారు. అక్షరాలు దిద్దాల్సిన చిట్టిచేతులు కట్టె, తట్టా, పార పట్టి ఇటుకలు తయారు చేయాల్సిన దుస్థితి దాపురించింది. మట్టి పనుల్లో పండంటి బాల్యం నిత్యం చితికిపోతోంది. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వం అనేక చట్టాలు చేసినప్పటికీ అవి సక్రమంగా అమలు కాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఎంతో మంది చిన్నారులు తమ భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకోవాల్సిన తరుణంలో వారి బాల్యాన్ని బుగ్గిపాలు చేసుకుంటూ బట్టీల్లో బాల కార్మికులు గానే మిగిలిపోతున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారుల్లో ఏమాత్రమూ కదలికలు లేకపోవడం గమనార్హం. ఒరిస్సా, కర్నాటక, మహారాష్ట్ర నుంచి వలస కూలీలు అధికంగా వచ్చి వారి యజమానులు చెప్పే పనులు నిర్వహిస్తారు. వారితో పాటు వారి పిల్లలు కూడా బట్టీల్లోనే మగ్గుతూ బాల్యాన్ని బుగ్గిచేసుకుంటున్నారు. దీంతో పిల్లల తల్లిదండ్రులకు సంబంధించిన యజమానులు చెప్పే పనుల్లో  నిమగ్నమవ్వడంతో చదువు వారికి అందని ద్రాక్షగానే మారింది. దీంతో తప్పని పరిస్థితుల్లో తమ కుటుంబ సభ్యులకు పనిలో ఆసరాగా ఉంటున్నారు. చిన్నారుల భవితవ్యం చితికిపోతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో యజమానులు సైతం ఆ చిన్నారులను బాలకార్మికులుగా మార్చి దర్జాగా పనులు చేయించుకుంటున్నారు. దీంతో చిన్నారుల బాల్యం బలైపోతోంది. బాలకార్మికుల చట్టాలను కఠినంగా అమలు చేసి, చిన్నారులను బాలకార్మికుల నుంచి విముక్తి కలిగించాల్సిన అవసరం ఉంది. చిన్నారులతో పనులు చేయించుకునే యజమానులకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, బాలబాలికల తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

పలు దుకాణాలలో కూలీలుగా
మండలంలోని స్వీట్ షాపుల్లో, బేకరిల్లో, ఆటో మొబైల్ రిపేర్ దుకాణాలతో పాటు పలు మరమ్మతుల షాపుల్లో పనులు చేసున్నారు. వీటిలో పనిచేసే వారికి సంవత్సరానికి జీతం మాట్లాడుకుని పనుల్లో పెట్టుకుంటున్నారు. అలాగే మన మండలంలో ఇతర రాష్ట్రాల నుంచి ఆర్థిక ఇబ్బందుల కారణంగా గ్రామీణ ప్రాంతల నుంచి, తండాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను ఇండ్లల్లో, హోటలల్లో తదితర చోట్ల వివిధ పనుల కోసం కుదురుస్తున్నారు. రైల్వేస్టేషన్లో, రహదారిలో చెత్త కాగితాలు  సేకరిస్తూ జీవనం సాగిస్తున్న వారిలో 18 ఏండ్లలోపు ఉన్న చిన్నారులు అధికంగా ఉన్నారు. ఏండ్లుగా మారని పరిస్థితిని ఇప్పటికైనా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలకు నడుంబిగించింది. అందులో భాగంగా ఆపరేషన్ ముస్కాన్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్పెషల్ డ్రైవ్లను నిర్వహిస్తోంది. మండలంలో కూడా పోలీసుల ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహించిన సమయంలో గతంలో పలువురు బాల కార్మికులు విముక్తి పొందారు. అమలు కాని విద్యాహక్కు చట్టంతో గిరిజనులతో పాటు ఒరిస్సా, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి పలు పనుల్లో పని చేసేందుకు వస్తున్న వారిలో తల్లిదండ్రులతో పాటు దాదాపు 10 నుంచి 17 ఏళ్ల వయస్సు ఉన్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాహక్కు చట్టం అమలుకావడం లేదు. ఏళ్లు గడుస్తున్నాయి.. కోట్ల రూపాయల నిధులు కరుగుతున్నాయి.. విద్యాభివద్ధికి అంత చేస్తున్నాం.. ఇంత చేస్తున్నాం.. అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వ పెద్దలు బడిబయట పిల్లలను బడి గడప తొక్కించలేకపోతున్నారు. బడిబయట పిల్లలు లేరని తప్పుడు లెక్కలుచూపడం… మండల విద్యాధికారి పూర్తిస్థాయి పర్యవేక్షణ కరువైందని సాకు చెబుతుండటం పరిపాటిగా మారింది. ఐదేళ్లు నుంచి 14 ఏళ్లలోపు ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం విద్యాహక్కు చట్టం ప్రధాన ఉద్దేశం. ఈ వయసు బాల బాలికలు ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. వారికి ఉచితంగా దుస్తులు, భోజనం, పుస్తకాలు అందించాలి. వైద్యం, ఇతర సౌకర్యాలు కల్పించి వారికి విద్యాబుద్ధులు నేర్పించాలి. ఇందు కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందించినా అవి అమలులో నిస్తేజంగా మారాయి.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading