నవతరం

తెలుగు దినపత్రిక

అదానీ ఆస్తులపై విచారణ చేపట్టాలి

  • బిడ్డా కెసిఆర్ బిఆర్ఎస్ ను బొంద పెడుతాం
  • విద్య గురించి మాట్లాడుతే కేసులా
  • ధర్మపురిలో అప్రకటిత నిర్భందం
  • డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ

జగిత్యాల, ఫిబ్రవరి 7 (నమస్తే ఎల్లంపల్లి): రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని బొందపెడుతామని డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. బిఎస్పి పార్టీకి అడుగడునా అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారని, బిఎస్పి పార్టీ జెండాలు కూలుస్తూ, కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ, నిర్బంధానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్ లో బిసిలకు తీరని అన్యాయం చేశారని గుర్తుచేశారు. వందకు యాబై మంది బిసిలు ఉంటే కేవలం వందకు మూడు రూపాయలు కేటాయించడాన్ని ఖండించారు. గిరిజన బంధు ఇస్తామని ప్రకటించి మోసం చేశారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ, యూనివర్సిటీ ప్రొఫెసర్లు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే,వారికి నోటీసులు పంపి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని బొంద పెడుతామని హెచ్చరించారు. బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడతలో భాగంగా నేడు 175వ రోజు గొల్లపల్లి, సిరికొండ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,దేశంలోని ఎస్.బి.ఐ, ఎల్ఐసి నుండి కోట్ల రూపాయలు దోచుకున్న అదానీ, అతనికి సహకరించిన ప్రధాని మోడిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో అప్రకటిత నిర్బందం కొనసాగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు స్థానిక మంత్రి చేసిందేమి లేదని విమర్శించారు. ఇప్పటికీ ప్రజలు ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా మంజూరు చేయలేదని తెలిపారు. పేదల ఇళ్లకు వేల రూపాయల కరెంట్ బిల్లులు వేసి చీకట్లో బతికేలా చేస్తున్నారని విమర్శించారు. బుడిగె జంగాల కుటుంబాలను మంత్రి పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. కమీషన్ల కోసం, కార్లు, ట్రాక్టర్ల కంపెనీలకు లాభాలు ఇవ్వడం కోసమే దళిత బంధు పథకం పెట్టారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాకముందు, ఇపుడు వచ్చినపుడు కూడా తెలంగాణ కాంట్రాక్టర్లను పక్కనపెట్టి ఆంధ్ర కాంట్రాక్టర్లకు సహాయం చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో బిఎస్పి మీటింగ్ కి రాకుండా బెదిరిస్తూ ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు పంచుతున్నారని పేర్కొన్నారు. బుగ్గారం మండలంలో ఇంటర్ కాలేజి లేదని, మండల కార్యాలయాలకు సొంత భవనాలు కూడా ఏర్పాటు చేయలేకపోయిన మంత్రి మనకెందుకన్నారు. పేదలకు సహాయం చేయాలని అభివృద్ధి చేయాలని అధికారం ఇస్తే, ప్రభుత్వం ఒక్కొక్కరిపై 1.29 లక్షల అప్పు మోపిందని అందుకే బిఆర్ఎస్ పార్టీకి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదని తెలిపారు. అందుకే రాష్ట్ర ప్రజలంతా రాబోయే ఎన్నికల్లో ఈ దోపిడీ దొంగల ప్రభుత్వాన్ని గద్దె దించి, బహుజన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి నారాయణ, జిల్లా అధ్యక్షులు పుప్పాల లింబాద్రి, నియోజకవర్గ ఇంచార్జి నక్క విజయ్, మండల అధ్యక్షులు స్వామి, మహిళా నాయకురాలు ముంజ లీలా గౌడ్, షహీన్ బేగం తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading