– గత బడ్జెట్ సమావేశాలలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
-సిఐటియు డిమాండ్
భద్రాచలం, ఫిబ్రవరి 01 (నమస్తే ఎల్లంపల్లి): భవన నిర్మాణ కార్మికులందరికీ మోటార్ సైకిల్ పంపిణీ చేస్తామని 2022 శాసనసభ బడ్జెట్ సమావేశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన హామీని వెంటనే అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి డిమాండ్ చేశారు. మోటార్ సైకిల్ పంపిణీ చేయాలని భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్ఐ బుద్ధ నరసింహారావుకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు కార్యాలయంలో జరిగిన సభను ఉద్దేశించి బ్రహ్మచారి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు శాసనసభలో ప్రకటించిన హామీని ఏడాది గడిచిన అమలు చేయలేదని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డులోని నిధులన్నీ కార్మికుల కోసమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 55,000 దరఖాస్తులు సంక్షేమ బోర్డులో పెండింగ్లో ఉన్నాయని ఆ దరఖాస్తులన్నింటికీ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
ప్రమాదం వల్ల చనిపోయిన కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న ఆరు లక్షల పరిహారాన్ని 10 లక్షల రూపాయలకు పెంచాలని సహజ మరణానికి ఇస్తున్న లక్ష రూపాయల పరిహారాన్ని ఐదు లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అన్ని మండల పట్టణ కేంద్రాలలో భవన నిర్మాణ కార్మికులకు అడ్డా స్థలాలు కేటాయించాలని నిర్మాణ కార్మికుల అడ్డాలలో షెడ్లు, మరుగుదొడ్లు నిర్మించడంతోపాటు మౌలిక వసతులను కల్పించాలని సిఐటియు డిమాండ్ చేసింది. 1996 కేంద్ర భవన నిర్మాణ కార్మికుల చట్టం ప్రకారం భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్, ఉన్నత విద్యా రుణాలు అందజేయాలని సిఐటియు డిమాండ్ చేసింది.

1979 వలస కార్మికుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, రాష్ట్ర శాసనసభ బడ్జెట్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణరంగ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా సంక్షేమ బోర్డుకు కార్మిక సంఘాల నాయకులతోటి అడ్వైజరీ కమిటీని వెంటనే నియమించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన నిర్మాణ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా మోటారు సైకిళ్ళు పంపిణి మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు అప్పారి రాము, నాయకులు ఎస్కే జాకీర్, చాట్ల శ్రీను, అనుగోజు శ్రీను, శివకూమార్, చిన్నరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.