– బీసీ లకు పిలుపునిచ్చిన బీసీ నేత ధనుంజయ నాయుడు
హైదరాబాద్: రాజకీయాలకు అతీతంగా బీసీలు ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు. హైదరాబాదులోని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. గత ఎనిమిది దశాబ్దాలుగా స్వతంత్ర భారతంలో బీసీలు అన్యాయానికి అణచివేతకు గురువుతూనే ఉన్నారని ఆయన తెలిపారు. అలాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా అస్తిత్వ ఉద్యమాలు ఊపొందుకున్నాయని, ఈ తరుణంలో బీసీ కుల గణన జరిపి జనాభా దామాషా ప్రకారం ఆయా కులాల వారికి విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, ఒకవేళ ఇప్పుడు తాత్సారం జరిగితే బీసీలు మరో 10 సంవత్సరాలు అణచివేతకు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని, ఎవరైతే బీసీలకు ద్రోహం చేయాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళని రాజకీయ సమాధి చేసేందుకు బీసీలు కూడా సిద్ధంగా ఉండాలని కోరారు. ఇటీవల కాలంలో బిజెపి పార్టీ కేంద్రంలో ఒక మాదిరిగా, రాష్ట్రంలో ఒక మాదిరిగా మాట్లాడుతున్నదని, ఇది ప్రజలందరూ గమనించాలని సూచించారు. ఆ పార్టీకి చెందిన ఒక రాజ్యసభ సభ్యుడు బీసీ రిజర్వేషన్ కొరకు ఢిల్లీ లో ధర్నా చేశాడని, బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాల్సింది బిజెపి పార్టీయేనని, అలాంటిది ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ధర్నా చేస్తున్నాడని, అతని పట్ల బీజేపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































