నవతరం

తెలుగు దినపత్రిక

ఎమ్మెల్యే అనుచరుడి కబ్జా భాగోతం

  • భూకబ్జాలో దూసుకుపోతున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అనుచరుడు
  • పదెకరాల ప్రభుత్వ భూమిని అమ్మి సొమ్ము చేసుకున్న వైనం
  • రెవెన్యూ అధికారులకు భారీగా ముడుపుల చెల్లింపు
  • గాజులరామారం సర్వే నంబర్ 342/1 లో రెచ్చిపోతున్న సాయిబాబా
  • ఎమ్మార్వో సంజీవరావు సహకారంతోనే భారీ కుంబకోణానికి తెరలేపిన వైనం
  • రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరమేశ్ రెడ్డి గురించి వేరేగా చెప్పనక్కర్లేదు
  • ఒక్కో ప్లాట్ కు మూడు లక్షలు దండుకుంటున్నట్టు ఆరోపణలు
  • వీడియో ముఖంగా బట్టబయలు చేసిన బీఆర్ఎస్ నాయకుడు ఎక్కే ఆబీద్
  • ఎమ్మార్వో డ్రైవరు అకౌంటు లో సాయిబాబా పదహారు లక్షలు జమచేసినట్టు ఆరోపణలు
  • ఎమ్మెల్యే, ఎమ్మార్వో.. ఓ కబ్జాదారుడు
  • ఈ కాంబినేషన్ బాగుందంటూ సెటైర్లు వేసుకుంటున్న ప్రజలు
  • జిల్లా కలెక్టర్ పర్యటనకు విలువలేదా..?
  • జిల్లా కలెక్టర్, ఆర్డీవో పర్యటనలతో ఉత్తుత్తి కూల్చివేతలు చేస్తున్న రెవెన్యూ అధికారులు
  • డమ్మీ రూముల కూల్చివేతలతో రిపోర్ట్ లు ఫైల్ చేస్తున్న తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు
  • ఎమ్మెల్యే అనుచరుడనే.. కాలాయాపన చేస్తున్నారా?
కుత్బుల్లాపూర్ నియోకవర్గం, గాజులరామారం డివిజన్లోని ప్రభుత్వ భూములు అమ్మి సొమ్ము చేసుకుంటూ స్థానిక ఎమ్మెల్యే అనుచరులు లక్షలు, కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. లాల్ సాహబ్ గూడ పరిధిలోని సర్వే నంబర్ 342, 342/1 లోని పదెకరాల ప్రభుత్వ భూమిని కాజేసి, అందులో అరవై గజాల చొప్పున ప్లాట్ లు చేసి, ఒక్కో ప్లాట్ ను పది లక్షల నుండి పద్దెనిమిది లక్షల వరకు అమ్ముకుంటూ దండుకుంటున్నాడు ఇక్కడి మాస్టర్ మైండ్ లాండ్ గ్రాబర్ మద్దెల సాయిబాబ. పదెకరాల ప్రభుత్వ భూమిని ప్లాట్ లుగా మార్చి ఇప్పటికే మూడు వందల ఇండ్లను అక్రమంగా నిర్మించారు ఇక్కడి కబ్జాకోరులు. అయినా కూడా వీరిపై చర్యలు మాత్రం శూన్యంగానే కనిపిస్తున్నాయి. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే ఈ మాస్టర్ మైండ్ ల్యాండ్ గ్రాబ్బర్ ఎప్పటికప్పుడు డమ్మీ రూములను నిర్మించి కూల్చివేతలకు వచ్చిన రెవెన్యూ అధికారులకు వాటిని చూపిస్తాడు. దీంతో ఫోటో షూట్ ల కోసం ఎదురుచూస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరమేశ్ రెడ్డి, తహశీల్దార్ సంజీవ రావు వాటిని కూల్చివేసి షూటింగు పూర్తి చేసుకుని అక్కడనుండి వెళ్లిపోతారు. ఇదంతా కూడా ఓ పథకం ప్రకారం జరుగుతుంది. దీని వెనుక ఎవరున్నారు, ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే వివేక్ మొద్దు నిద్రలో ఎందుకున్నాడు అనే అంశాలతో 'నమస్తే ఎల్లంపల్లి' ప్రత్యేక కథనం మీ ముందుకు..

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజులరామారం ఓ బంగారు బాతు గుడ్డులా మారింది. ఇక్కడ ఎవరైనా, ఎప్పుడైనా తమకు తోచినంత ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకోవచ్చంటున్నారు ఇక్కడి ప్రజలు దీనికి కావలిసిన క్వాలిఫికేషన్ మాత్రం ఎమ్మెల్యే అనుచరులైతే చాలా, అంతేనా ఇంకేమైనా కావాలా అంటే.. అదొక్కటి చాలు మిగతావన్నీ వాటంతట అవే వస్తాయంటున్నారు విషయం తెలిసినవారు. గాజులరామారం డివిజన్ లో చాలా వరకు ప్రభుత్వ భూములున్నాయి. ప్రధానంగా ఇక్కడి సర్వే నంబర్ 239, 329/1, 342, 342/1 లోని ప్రభుత్వ భూముల్లో గత పది సంవత్సరాలుగా ఆక్రమణలు జరుగుతున్నాయి. గతంలో ఎక్కడో ఒక చోట అరవై, ఎనభై గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి అందులో చిన్న చిన్న గదులు నిర్మాణం చేసుకుని కొందరు సొంత ఇండ్లు లేక, మరికొందరు వాటిని అమాయక ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుని వారి అవసరం తీర్చుకునేవారు. ప్రభుత్వ భూమిని అమ్మి సొమ్ము చేసుకున్న వారిపై కేసులు నమోదు చేసి అప్పటి రెవెన్యూ అధికారులు కబ్జాదారులను జైలుకు పంపేవారు. దీంతో ఎంతో కొంత భయంతో ఉండేవాడు. ప్రస్తుతం మాత్రం వీటన్నింటికీ భిన్నంగా వ్యవహరిస్తూ ఎకరాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ పట్టపగలే వాటిలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ రెవెన్యూ అధికారులకు సవాలుగా మారుతున్నారు. ఇంత జరుగుతున్నా కుత్బుల్లాపూర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరమేశ్ రెడ్డి మాత్రం ఎన్ని ఆక్రమణలు జరిగితే అంత దండుకోవచ్చనే ఆలోచనతో ఇక్కడి ఆక్రమణ ల విషయాలను కొద్ది రోజులు స్థానిక ఎమ్మార్వో కు తెలియకుండా కావలికారులైనటువంటి నాగరాజు, దేవ లను మచ్చిక చేసుకుని వారి ద్వారా భూకబ్జాదారులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని లక్షల రూపాయలు దండుకుని జేబులు నింపుకున్నాడంటూ స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు భూకబ్జాల వ్యవహారాన్ని ఎమ్మార్వో సంజీవరావు దృష్టిలో పెట్టాడు. అప్పటి నుండి ఎమ్మార్వో సంజీవ రావు సైతం తన జేబు నింపుకోవటం మొదలు పెట్టాడు. కుత్బుల్లాపూర్ రెవెన్యూ కార్యాలయం సాక్షిగా మంతనాలు జరపటం, ఆ తర్వాత దగ్గరలో ఉన్న త్రీ స్టార్ హోటల్ లో మకాం వేయటం, కాస్ట్లీ మద్యం సేవించటం, అమ్మిన ప్లాట్ ల డబ్బుల లెక్క చూసుకోవటం, ఎవరెవరికి ఎంత రావాలో పంచుకుని అక్కడ నుండి ఎవరి దారిన వారు వెళ్ళిపోవటం అంతా ఒక పథకం ప్రకారం జరిగేలా ప్లాన్ చేసుకుంటారంటూ మండి పడుతున్నారు కొందరు సామాజిక కార్యకర్తలు. ఈ విషయం అంతా అటూ ఇటూ చేరి కొద్ది రోజులకు ఎమ్మెల్యే దృష్టికి రావటంతో ఇక్కడి కబ్జాదారులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద మందలించినట్టు సమాచారం. ఖాళీ ప్లాట్ లను అమ్మి, మళ్ళీ వాటినే వేరేవారికి ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటుండటంతో.. కొందరు బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లటంతో విషయమంతా చిట్లి, చిట్లి వానజల్లయినట్టుగా నియోజకవర్గమంతా తెలిసిపోయింది. అప్పటివరకు మాజీ ఎమ్మెల్యే వెనకాల తిరిగే ఇక్కడి కబ్జాదారుడు మద్దెల సాయిబాబా ప్రస్తుత ఎమ్మెల్యే కేపీ వివేకానంద సరసన చేరాడు. దీంతో తన భూకబ్జాలకు ఏమాత్రం ఆటంకం ఉండదని ఆలోచించిన సాయిబాబా మరింతగా రెచ్చిపోయి మూడు వందల ఇండ్ల నిర్మాణాలతో ఒక బస్తీనే ఏర్పాటు చేశాడు. ఇక్కడ జరుగుతున్న భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలన క్యాప్చర్ చేస్తూ ఎవరో ఓ వ్యక్తి డ్రోన్ ఎగురవేసి అందులో నిక్షిప్తం చేసి, వాటిని స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులకు పంపించాడు. అప్పటివరకు మాటలవరకే తెలిసిన వీరి కబ్జా భాగోతం స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేపింది. ఒక సినిమా ను తలపిస్తున్న ఇక్కడి భూకబ్జాలు భాతరదేశంలోనే ఒక పెద్ద ఆర్థిక కుంభకోణంగా నిలిచిపోతుందంటున్నారు నిపుణులు. ఒక్కో ప్లాట్ పది లక్షల రూపాయలకు అమ్ముకున్నా సుమారు ముప్పై కోట్ల రూపాయల కుంభకోణం కళ్ళకు కట్టినట్టు కంపించినా తమకేమీ తెలియదన్నట్టు నామమాత్రపు కూల్చివేతలు చేస్తూ, ఫోటో షూట్లకు వచ్చినట్లుగా కూల్చివేతలు జరుపుతూ వాటిని పై అధికారులకు నివేదక పంపుతారు స్థానిక ఎమ్మార్వో, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు. దీనికంతటికీ ప్రధాన కారణం ఇక్కడి కబ్జాదారుడు సాయిబాబా ఎమ్మెల్యే అనుచరుడు కావటమేనంటున్నారు ఇక్కడి జనం. తాజాగా కూల్చివేతలు జరిపిన ఎమ్మార్వో సంజీవ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడ ఎవరు కబ్జాలు చేస్తున్నారో తెలియటం లేదు, కూల్చివేతలు జరిపిన వాటిలో ఎవరైనా పేదలుంటే వారిని గుర్తించి వారికి ప్రభుత్వం నుండి సహాయం అందేలా చూస్తామనటం పలు అనుమానాలకు తావిస్తుంది. కొన్ని వందల సంఖ్యలో ఇండ్లు నిర్మించి, బస్తీ మధ్యలో ఉన్న క్రషర్ మిషన్ కార్యాలయాన్ని చర్చిగా మార్చి లక్షలు దండుకున్న కబ్జాదారులు ఈ ఎమ్మార్వో కు తెలియదా, ఈ భూకబ్జాల తతంగాన్ని ఎమ్మార్వో దృష్టికి తీసుకువచ్చిన వారిపై దారుణంగా కొందరు గూండాలను పెట్టి దాడులు చేపించిన సాయిబాబా గురించి తెలియదా అంటూ మండి పడుతున్నారు ఇక్కడి ప్రజలు. సర్వే నంబర్ 342, 342/1 లోని ప్రభుత్వ భూములను ఆక్రమించి ఎమ్మార్వో డ్రైవరు అకౌంటు లో పదహారు లక్షలు వేసుకున్నట్టు ఆరోపించిన ఎస్కే ఆబీద్ మాటలకు సదరు ఎమ్మార్వో ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు విషయం తెలిసినవారు. ఇంత జరుగుతున్నా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మాత్రం కబ్జాదారులకు అండగా నిలుస్తున్నాడానే ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. ప్రజల ఎమ్మెల్యే కాదు, కబ్జదారులకు మాత్రమే ఎమ్మెల్యే అంటూ గుసగుసలాడుతున్నారు ఇక్కడి ప్రజలు. దీంతో ‘ఎమ్మెల్యే, ఎమ్మార్వో.. ఓ కబ్జాదారుడు’ అంటూ ‘అమ్మా, నాన్న.. ఓ తమిళ అమ్మాయి’ సినిమా టైటిల్ ను గుర్తు చేసుకున్నారు స్థానిక ప్రజలు. దీంతో కైసర్ నగర్లోని రెండువందల గజాల స్థలంలో జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ ను నిర్మించుకున్నాడు సాయిబాబ.

భూకబ్జాలతో ఆదరణ కోల్పోతున్న ఎమ్మెల్యే వివేక్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూములను కబ్జా చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్న కొందరు భూకబ్జాదారులు ఎమ్మెల్యే వివేక్ అనురులుగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మరికొంత మంది కబ్జాదారులు ఎమ్మెల్యే వివేక్ కు అనుచరులుగా మారారు. ఇప్పటికే ఈ భూకబ్జాలు వాటి వ్యవహారం నచ్చకపోవటంతో కొందరు కార్పొరేటర్లు ఎమ్మెల్యే వివేక్ ను వీడి మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు కు మద్దతుగా ఉన్నారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న నాలుగు డివిజన్లలో ఎమ్మెల్యే పై అసమ్మతి పెరిగిందని స్థానిక ప్రజలు అంటున్నారు. ప్రధానంగా గాజులరామారం డివిజన్లో ఉన్న ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్న బురగరాజు, సాయిబాబా, మసూద్, ఇబ్రాహీం, గౌస్ పాషా, రమేష్, మధు, వెంకటేశ్ లాంటివారికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు దండుగా ఉన్నాయని నియోజకవర్గ ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని డివిజన్లలోని ప్రజలు కేపీ వివేకానంద ఈ  భూకబ్జాలతో అందినకాడికి దండుకుంటున్నాడాని మండిపడుతున్నారు. నియోజకవర్గ అభివృద్ది దేవుడెరుగు.. ప్రభుత్వ భూములు మాయం చేయటంలో మాత్రం ఎమ్మెల్యే చేతివాటం బాగానే ఉందంటూ చర్చించుకుంటున్నారు ఇక్కడి ఓటర్లు.

ఎమ్మార్వో, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆస్తులపై విచారణ జరపండి

కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని ప్రభుత్వ భూములను రక్షించాల్సిన ఎమ్మార్వో, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్రమ నిర్మాణాలను ఎప్పటికప్పుడు కూల్చివేసి, భూకబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సింది పోయి, కొన్ని వందల ఇండ్ల నిర్మాణం జరిగేవరకు కాలాయాపన చేస్తూ, ఒక్కో ప్లాట్ కు మూడు లక్షల రూపాయలు దండుకుంటున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నా వీరిపై ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. భూకబ్జాదారులపై దృష్టి సారించిన ఎస్వోటీ పోలీసులు ఇప్పటికివరకు ఏ రకమైన నివేదిక తయారు చేశారంటూ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు ఇక్కడి ప్రభుత్వ భూముల ఆక్రమణల పై వార్తలు ప్రచురించిన, కవరేజీ కి వెళ్ళిన కొందరు విలేకరులపై భూకబ్జాదారులు భౌతిక దాడులకు పాల్పడుతుంటే పోలీసులు సైతం చూసీ చూడనట్టు వ్యవహరించడం దేనికి సంకేతమంటూ పెదవి విరుస్తున్నారు కొందరు సామాజక కార్యకర్తలు. భూకబ్జాదారుల వద్ద ఒక్కో రూము నిర్మించుకోవటానికి మూడు లక్షల రూపాయల చొప్పున రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరమేశ్ రెడ్డి, ఎమ్మార్వో సంజీవరావు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేసిన విషయం ఎందుకు సర్దుమనిగింది, ఎమ్మార్వో డ్రైవరు అకౌంటు లో భూకబ్జాదారుడు సాయిబాబా పదహారు లక్షల రూపాయలు జమచేశాడంటూ సోషల్ మీడియా / వీడియో సాక్షిగా ఎస్కే ఆబీద్ చేసిన ఆరోపనలకు ఎమ్మార్వో సంజీవ రావు ఏం సమాధానం చెబుతారు అంటూ ప్రశ్నిస్తున్నారు డివిజన్ ప్రజలు. దేవేందర్ నగర్ నుండి మొదలుకుని కైసర్ నగర్ వరకు ప్రభుత్వ భూమిలో వెలసిన కొన్ని వందల అక్రమ నిర్మాణాలకు తమ సహకారం లేదని ఎమ్మార్వో సంజీవరావు సమాధానం చెప్పగలరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూములు కాపాడలేని ఎమ్మార్వో ఉంటే ఎంత, లేకపోతే ఎంత.. వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసి ఇలాంటి లంచగొండి అధికారుల చిట్టా చింపాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. కుత్బుల్లాపూర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరమేశ్ రెడ్డి, ఎమ్మార్వో సంజీవరావు ఆస్తులపై ఏసీబీ దాడులు నిర్వహించి, వీరి అక్రమ సంపాదన వెలికితీయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading