నవతరం

తెలుగు దినపత్రిక

టీచర్లపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోండి

*టీచర్లపై దాడిచేసిన నాయకులపై చర్యలు తీసుకోవాలి
*బిజెపి బిసిలకు న్యాయం చేయడంలో విఫలం
*కోనప్ప కబ్జా చేసిన భూములు పేదలకు పంచుతాం

సిర్పూర్ / ఆసిఫాబాద్, నమస్తే ఎల్లంపల్లి: చట్టాన్ని చేతికి తీసుకొని అన్యాయంగా టీచర్లపై దాడులు చేసిన సంఘ్ పరివార్, విహెచ్పి సంఘాలపై చర్యలు తీసుకోవాలని డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బహుజన దేవతలైన సమ్మక్క సారక్కలను దారుణంగా అవమానించిన స్వాములపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా నేడు 157 వరోజు ఆయన సిర్పూర్ నియోజకవర్గంలోని సిర్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం బిసిల కులగణన చేయకుండా, బిసి రిజర్వేషన్లు పెంచకుండా మోసం చేసిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బిసి రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాల్సి వస్తుందని అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించడం లేదని ఆయన ఆరోపించారు. ధరణి పోర్టల్ కేవలం కుటుంబ ఆస్తుల కోసం, ప్రభుత్వ భూములు కబ్జా చేయడం కోసం మాత్రమే ఉపయోగపడిందని ఎద్దేవా చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో కోనేరుకోనప్ప ఆగడాలను వెంటనే ఆపాలని, భూముల ఆక్రమణ, గుట్కా దందా ఆపాలని డిమాండ్ చేశారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరించారు. సిర్పూరులో ఉండాల్సిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు కాగజ్ నగర్ లో నిర్మించి సిర్పూర్ అభివృద్ధి కాకుండా కుట్ర చేశారని ఆరోపించారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఇళ్లు లేని పేదలు అనేకం ఉన్నారని, పాఠశాలల్లో కనీసం పిల్లలకు టాయిలెట్స్ కూడా కట్టివ్వలేదని విమర్శించారు. సిర్పూర్ లో మినీ ట్యాంక్ బండ్ నిర్మిస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. బస్టాండ్, మార్కెట్ యార్డు, ప్రయాణికులకు టాయిలెట్స్ కూడా నిర్మించలేదని మండిపడ్డారు. కోనప్ప కబ్జా చేసిన భూములన్ని బహుజన రాజ్యంలో పేదలకు పంచుతామన్నారు. చింతకుంట గ్రామానికి చెందిన సంగీత అనే డిగ్రీ అమ్మాయి చనిపోతే కనీసం పట్టించుకోలేదని, దానిపై విచారణ జరిపి పరిహారం చెల్లించి, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుండాగిరి, దోపిడి పాలనను అంతం చేస్తామన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ వల్లనే ఆయన ఎమ్మెల్యే అయ్యాడని, బిఎస్పి పార్టీలో గెలిచి టిఆర్ఎస్ లో చేరారని గుర్తుచేశారు. రాబోయే కాలంలో కెసిఆర్, కోనేరు కోనప్ప వంటి దొంగలను ఇంటికి పంపుతామని తెలిపారు. యాత్రలో భాగంగా ఈస్గం, చింతకుంట, మాకిడి, జక్కారం, సిర్పూర్ గ్రామాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సీడం గణపతి, నియోజకవర్గ ఇంచార్జీ అర్షద్ హుస్సేన్, నియోజకవర్గ నాయకులు దుర్గం ప్రవీణ్ కుమార్, రాం ప్రసాద్, షేక్ చాంద్, గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading