నవతరం

తెలుగు దినపత్రిక

పెద్దవాగుపై వంతెన కూలితే చర్యలేవి?

* పత్తిధర పెంచి రైతులను ఆదుకోవాలి.
* కోనేరు కోనప్పను ఓడించి తరిమేస్తాం.
* దోపిడీ కబ్జాదారుల ప్రభుత్వాన్ని ఓడిస్తాం.

* డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ.

సిర్పూర్, నమస్తే ఎల్లంపల్లి: అందెవెల్లి ప్రాజెక్టుపై నిర్మించిన వంతెన కూలిపోవడానికి కారణమైన వారిపై చర్యలెందుకు తీసుకోలేదని డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా నేడు 155వ రోజు ఆయన దహెగాం మండల పర్యటనలో భాగంగా అందెపెల్లి దగ్గర గల బ్రిడ్జిని పరిశీలించారు. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన వంతెన కొద్దిరోజులకే కూలిపోవడానికి గల కారణాలేంటని ప్రశ్నించారు. వంతెన కూలడానికి కారకులైన కాంట్రాక్టర్, ఇంజనీర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు కూడా కూలడానికి సిద్దంగా ఉందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే ఈ అంశంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని,మరమ్మతులు చేయించడం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడం వల్ల వర్షాకాలంలో దహెగాం మండల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
అంతేలకుండా వర్షాకాలంలో వచ్చే వరదల వల్ల పెసరికుంట గ్రామంలో పంటలకు నష్టం జరిగితే పరిహారం అందించడంలో ప్రభుత్వం ఎమ్మెల్యే కోనప్ప విఫలమయ్యారని తెలిపారు. రైతులు కష్టపడి పండించిన పత్తికి క్వింటాళ్ ధర 15 వేల నుండి 7 వేలకు తగ్గించి రైతుల నోట్లో మన్ను కొట్టిందని మండిపడ్డారు. వెంటనే పత్తి ధర పెంచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆదివాసుల భూములకు పట్టాలిస్తామని చెప్పి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.

దహెగాం మండల కేంద్రంలో మార్కెట్ యార్డు ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. కెసిఆర్, కెటిఆర్ నియోజకవర్గాల్లో ఎసి మార్కెట్లు నిర్మించుకొని, పేదలు ఉండే చోట ఎందుకు నిర్మించడంలేదని ప్రశ్నించారు. మన గ్రామాలకు రోడ్లు సరిగా లేవని, కానీ కెసిఆర్ ఫాంహౌస్ కు మాత్రం అద్దంలాంటి రోడ్లు వేసుకున్నారని ఆరోపించారు.

సిర్పూర్ పేపర్ మిల్ కార్మికుల కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదని, స్థానికులకంటే ఇతర రాష్ట్రాల వారికే ఎక్కువ ఉద్యోగాలిస్తూ,కమీషన్ల కోసం, కోట్ల ఆదాయం కోసం కోనేరుకోనప్ప స్థానిక జె.కె కంపెనీ యాజమాన్యంతో కున్మక్కై కెసిఆర్, కెటిఆర్ అండదండతో కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కోనేరు కోనప్ప నోటిఫైడ్ భూములను కబ్జా చేస్తూ, పేదల భూములు ఆక్రమిస్తూ, గుట్కా దందా, బియ్యం దందా నడుపుతున్న ఎమ్మెల్యేను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బహుజన రాజ్యంలో కోనప్ప లాంటి దోపిడి, కబ్జాదారులను జైలుకు పంపుతామని హెచ్చరించారు. తెలంగాణలో పేదలకు చెందిన, పేదలకోసం ఖర్చు చేయాల్సిన డబ్బుతో, వందలకోట్లు పెట్టుబడిపెట్టి లిక్కర్ స్కాం చేస్తున్నారని ఆరోపించారు.

భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయిఫూలే జయంతి సందర్భంగా ఆయన నివాళి అర్పించారు. బహుజన రాజ్యంలో జనవరి 3 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతామని ప్రకటించారు. యాత్ర అంకుశాపూర్, అందెపల్లి, బీబ్ర, పిసర్ కుంట, ఐనం, దహెగాం గ్రామాల్లో పర్యటించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సీడం. గణపతి, నియోజకవర్గ ఇంచార్జి అర్షద్ హుస్సేన్, నియోజకవర్గ అధ్యక్షులు దుర్గం ప్రవీణ్, నక్క మనోహర్, రేణికుంట్ల శ్రీనివాస్, కనక ప్రసాద్, రాం ప్రసాద్, శ్రీనివాస్, మేరుగు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading