నవతరం

తెలుగు దినపత్రిక

దళిత అధికారులు ఛీఫ్ సెక్రటరీ కావద్దా?

* శివాలయాలపై కెసిఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం
* విద్వేషాలు రెచ్చగొడుతున్న బిజెపి
* డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ

వర్దన్నపేట / వరంగల్, నమస్తే ఎల్లంపల్లి: తెలంగాణ రాష్ట్రానికి ఛీఫ్ సెక్రటరీగా అన్ని రకాల అర్హతలు ఉన్నా రాణి కుముదిని ఎందుకు నియమించలేదని డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కెసిఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రస్తుత సిఎస్ శాంతి కుమారి కంటే ఒక సంవత్సరం సీనియర్ అధికారి అయినా, కేవలం దళిత వర్గానికి చెందిన అధికారి కాబట్టే సిఎస్ పదవి ఇవ్వలేదని విమర్శించారు. దళిత బంధు, సచివాలయానికి అంబేడ్కర్ పేరు, 125 అడుగుల విగ్రహం పెడుతామని చెపుతూ,మరోపక్క దళిత అధికారులకు ఉన్నత పదవులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన పేర్కొన్నారు. బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడతలో భాగంగా నేడు 165వ రోజు వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఐనవోలు దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో శైవ దేవాలయాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు. కాకతీయుల కాలంనాటి ఎంతో ప్రాధాన్యత కలిగిన ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయంతో పాటు, రామప్ప, వేములవాడ రాజన్న, కొమురవెల్లి మల్లన్న, కీసర గుట్ట, అలంపూర్ నవబ్రహ్మస్వామి వంటి దేవాలయాలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కొన్ని దేవాలయాలకు వందల కోట్లు కేటాయించి మరి కొన్నింటిని ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం గ్రామదేవతలు, శైవ దేవాలయాలపై ఉద్దేశిశ్యపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. కానీ బహుజన రాజ్యంలో గ్రామదేవతలకు పెద్దపీట వేస్తామన్నారు. అన్ని దేవాలయాలను సమానంగా అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు. చర్చిలు, మసీదులను కూడా సమానంగా అభివృద్ధి చేసి, సమానంగా నిధులు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వం బిసి వర్గాలకు తీరని అన్యాయం చేసిందన్నారు. బిసిల జనాభా 52 శాతం ఉంటే కేవలం 27శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తున్నారన్నారు. సిఎం కార్యాలయంలో ఒక్క బిసి అధికారి,ఎస్టి,మైనారిటీ అధికారి ఎందుకు లేరని మండిపడ్డారు. రాష్ట్రంలోని బహుజనులందరికి మోసం చేస్తూ ఏ ముఖం పెట్టుకొని ఖమ్మంలో బహిరంగ సభ పెడుతున్నారని అడిగారు. మరోవైపు బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తుందని ఆరోపించారు. ఉపాధ్యాయులపై బిజెపి అనుబంధ సంఘాల దాడిని ఖండించారు. బిసిల కులగణన చేయకుండా బిసిలను అవమానిస్తున్నారని పేర్కొన్నారు. బిసిలకు న్యాయం చేయకుండా మోడి తెలంగాణలో అడుగుపెట్టద్దని హెచ్చరించారు. టిఆర్ఎస్, బిఆర్ఎస్ అంటూ ఎన్ని అవతారాలెత్తినా ప్రజలు వారికి విఆర్ఎస్ ఇచ్చేందుకు సిద్దమయ్యారని తెలిపారు. దమ్ముంటే తమిళనాడు, జార్ఖండ్, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల వలే బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రిజర్వేషన్లు పెంచి,ప్రస్తుత గ్రూప్ 1, అన్ని ఉద్యోగాలకు ఆ రిజర్వేషన్లను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. బిసి భవనాలను హైదరాబాద్ లోని నాలాలపై నిర్మిస్తూ,ఆధిపత్య వర్గాల భవనాలను మాదాపూర్ వంటి విలువైన భూముల్లో నిర్మిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా భూములను అక్రమంగా కబ్జా చేసి, మాస్టర్ ప్లాన్ పేరుతో పేదలను భూ నిర్వాసితులుగా మారుస్తున్నారని గుర్తుచేశారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆగడాలను ప్రశ్నించారు. భూములు కబ్జా చేస్తూ, ప్రశ్నించిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ సిఎస్ సోమేష్ కుమార్ మరియు కెసిఆర్ కలిసి ధరణి పోర్టల్ తీసుకువచ్చి పేదల భూములను దోచుకున్నారని పేర్కొన్నారు. అందుకే పేదలకు న్యాయం జరగాలన్నా, భూములకు పట్టాలు రావాలన్నా, దొరల పాలన పోవాలన్నా మన బహుజన రాజ్యం రావాలని సూచించారు. అందుకోసం రాబోయే ఎన్నికల్లో బిఎస్పి పార్టీనే గెలిపించాలని కోరారు. ఐనవోలు మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం వర్దన్నపేట చేరుకొని ర్యాలీగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి తర్వాత వర్దన్నపేట బిఎస్పి పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాదారపు రవికుమార్,వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద శ్యాం, హన్మకొండ జిల్లా అధ్యక్షులు శనిగరపు రాజు, జనగామ జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి, హన్మకొండ జిల్లా ఇంచార్జి సారయ్య, వర్ధన్నపేట నియోజకవర్గ అధ్యక్షులు సదానందం, మహిళా నాయకురాలు పద్మ,పుష్పలత, సోమలక్ష్మి, కన్నం సునీల్, వైనాల కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading