నవతరం

తెలుగు దినపత్రిక

రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో బిజెపి, బిఆర్ఎస్ బిజీగా ఉన్నాయి

* సెక్యులర్ పదాన్ని తొలగించాలని చూస్తున్నారు
* బహుజన రాజ్యంలో మత స్వేచ్ఛ హక్కును కాపాడుతాం
* డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ.

అలంపూర్, నమస్తే ఎల్లంపల్లి: భారత రాజ్యాంగాన్ని మార్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని మన హక్కులు కాపాడుకోవాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద ఉందని డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. 300ల రోజుల బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఈ రోజు 153వ రోజు యాత్ర జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ లో సాగింది. యాత్రలో భాగంగా నేడు క్రైస్తవుల పవిత్ర దినం క్రిస్టమస్ పండగ సందర్భంగా పలు గ్రామాల్లోని చర్చిలను సందర్శించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిజెపి నాయకులు రాజ్యాంగంలోని “సెక్యులర్” అనే పదం తొలగించాలని చూస్తున్నారని, అదే జరిగితే దేశంలో మైనారిటీలు స్వేచ్ఛగా తమ మతాలను, సంస్కృతిని అనుసరించే హక్కును కోల్పోతారని పేర్కొన్నారు. అంతేకాకుండా మైనారిటీలు ఓటు హక్కు కోల్పోతారని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా పత్రికా సమావేశం పెట్టి రాజ్యాంగాన్ని మార్చాలని ప్రకటించారని గుర్తుచేశారు. ఈ పార్టీలకు మైనారిటీల ఓట్లు కావాలి తప్ప వారి హక్కులు, అభివృద్ధి కాదని విమర్శించారు. మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి, ఎందుకు పెంచడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే భారత రాజ్యాంగాన్ని కాపాడుతుందని, భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా కలిగిన ఏకైక పార్టీ బిఎస్పి అని స్పష్టం చేశారు. అందుకే రాబోయే ఎన్నికల్లో రాజ్యాంగ వ్యతిరేక పార్టీలను ఓడించి బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించాలని కోరారు. యాత్ర ఎర్రవల్లి, వేముల, షాబాద్, శాంతినగర్, జూలేకల్, ఉప్పల్, మేడికొండ, పులికల్ గ్రామాల్లో పర్యటించారు. వేముల గ్రామంలో యువకులతో క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా నాయకులు కేశవరావు, మహిళా కన్వీనర్ రాములమ్మ, నియోజకవర్గ నాయకులు మహేష్, కనకం బాబు తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading