నవతరం

తెలుగు దినపత్రిక

మీ పిల్లలకో న్యాయం, మా పిల్లలకో న్యాయమా?

* బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు మిలాఖత్
* ఫాంహౌస్ పంటలకో రేటు, రైతుల పండిస్తే ఇంకో రేటా?
* డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ

కాగజ్ నగర్ / ఆసిఫాబాద్, నమస్తే ఎల్లంపల్లి: కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీలు ఒక్కటయ్యాయని, పేదల సొమ్మును దోచుకోవడంలో ఆ పార్టీలు మిలాఖత్ అవుతాయని డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 159వ రోజు యాత్ర కాగజ్ నగర్ మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును అధికార పార్టీ నాయకులు పందికొక్కుల్లా మెక్కుతున్నారని ఆరోపించారు. దోచుకున్న సొమ్మంతా కేవలం వారి సామాజిక వర్గ ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో వందలకోట్ల విలువైన భూముల్లో ఆధిపత్య వర్గాల వారికి భవనాలు కట్టించి, మిగిలిన వర్గాలకు నగరం బయట కనీసం భవనాలు ప్రారంభం కూడా చేయలేదని విమర్శించారు. అందుకోసమే బహుజన రాజ్యం వస్తే బహుజన కులాలకు న్యాయం జరుగుతుందని సంపద సమానంగా పంచబడుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ నాశనమైందన్నారు. పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం కూడా సరిగా పెట్టడం లేదని, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నియోజకవర్గంలోనే చిన్నపిల్లలు విషాహారం తిని అస్వస్థతకు గురయ్యారని గుర్తుచేశారు. అనేక పాఠశాలలకు వసతులు లేవు,టీచర్లు లేరు,టాయిలెట్స్ లేవు, కనీసం యూనిఫాం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల పిల్లలు, ఎమ్మెల్యే,మంత్రుల పిల్లలైతే ఇలాంటి పాఠశాలల్లో చదువుతారా? మీ పిల్లలకు ఎసి గదులు,పేద పిల్లలకు కూలిపోతున్న భవనాలా అని ప్రశ్నించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో కనీసం కరెంట్ సౌకర్యం లేకపోవడం దారుణమన్నారు. పేదలకు చెందిన భూములు లాక్కుంటున్నారని, అందువల్లనే కామారెడ్డిలో రైతు మరణించాడని తెలిపారు. వరదల్లో పేదల భూములు మునుగుతే నష్టపరిహారం ఇవ్వకుండా, రుణాలు మాత్రం కట్టాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. రైతులు పండించిన పత్తికి మద్దతుధర ఇవ్వకుండా, అప్పులపాలు చేస్తున్నారన్నారు. ఫాంహౌస్ లో పండించే రైతులు ఏనాడైనా ధర్నా చేశారా అని ప్రశ్నించారు. పంటకు పంటలకోక ధర, పేదల పంటకు ఇంకో ధర ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పత్తి ధరను క్వింటాళ్ కి పదిహేను వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాగజ్ నగర్ మండలంలోని బొగడగూడ, గంగన్నగూడ, జంబుగ, మాలినగర్, సీతానగరం గ్రామాల్లో పర్యటించి, పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలు,అంగన్ వాడీ సెంటర్లు బాగుచేయకుండా కోట్ల రూపాయలు దోచుకున్న కోనప్ప మళ్లీ ఓట్లను డబ్బుతో కొనాలని చూస్తున్నాడని మండిపడ్డారు. గ్రామాల్లో రోడ్లు సరిగా లేక, బస్సు సౌకర్యం లేదని, అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సీడం గణపతి, నియోజకవర్గ ఇంచార్జి అర్షద్ హుస్సేన్,నియోజకవర్గ అధ్యక్షులు రాం ప్రసాద్, నియోజకవర్గ నాయకులు దుర్గం ప్రవీణ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading