* కమీషన్ల కోసమే ప్రాజెక్టు రీడిజైన్
* కొమురంభీం కలలుగన్న రాజ్యాన్ని సాధిస్తం
* డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ.
కౌటాల / ఆసిఫాబాద్, నమస్తే ఎల్లంపల్లి: కేవలం కమీషన్ల కోసం,స్వార్థ రాజకీయాల కోసమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మధ్యలో నిలిపివేసి,రీడిజైన్ పేరుతో ఆదిలాబాద్ ప్రజలను కెసిఆర్ నిండా ముంచారని డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఆసిఫాబాద్,మంచిర్యాల జిల్లాలకు చెందిన 2 లక్షల ఎకరాలకు రావల్సిన సాగునీటిని కుట్రపూరితంగా అడ్డుకొన్నారన్నారు. ఆ ప్రాజెక్టుకు డా.బి ఆర్ అంబేడ్కర్ పేరు పెట్టినందుకే ఆపేశారని అనుమానం వ్యక్తం చేశారు.రీ డిజైన్ వల్ల అదనంగా 25 వేల కోట్ల నష్టం సంభవించిందని,పైగా రీడిజైన్ వల్ల లక్ష్యాన్ని కూడా చేరుకోలేదన్నారు.148 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించకుండా,మేడిగడ్డ వద్ద కేవలం 100 మీటర్ల ఎత్తులో నిర్మించి లిఫ్ట్ చేస్తున్నారని,దానివల్ల ఖర్చు పెరగడంతో పాటు విపరీతమైన కరెంట్ చార్జీలు కట్టాల్సి వస్తుందని తెలిపారు.తుమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లికి అతితక్కువ ఖర్చుతో నీటిని పంపే అవకాశం ఉన్నా,కేవలం తమ కమీషన్ల కోసం,ముఖ్యమంత్రే ఇంజనీర్ అవతారమెత్తి, ఎంతమంది మేధావులు చెప్పినా వినకుండా 1.15 లక్షల కోట్లతో కాళేశ్వరం నిర్మించారని ఎద్దేవా చేశారు.కానీ ఇటీవల వరదలకు పంపుహౌస్ మునిగిపోవడంతో 1500 కోట్ల నష్టం వచ్చిందని గుర్తుచేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన ఖర్చులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టనపుడు ప్రజల నుండి సేకరించిన భూమిని తిరిగి ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. భూములు కోల్పోయి,ఉన్న భూములకు నీరు రాక ప్రజలు రెండు విధాల నష్టపోయారని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ముంపుకు గురైన మహారాష్ట్ర ప్రజలకు లక్షల రూపాయల పరిహారం అందించి,తెలంగాణ రైతులను మాత్రం పట్టించుకోవడం లేదని,మన రైతుల పొట్టలు కొట్టి,పొరుగు రాష్ట్ర ప్రజల కడుపు నింపుతున్నారని ఆరోపించారు. బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి రెండు లక్షల ఎకరాల భూమిని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.ప్రాణహిత నీళ్ల సాక్షిగా,ప్రజలకు మోసం చేసిన ప్రభుత్వాన్ని పాతరేసి,పేదల రాజ్యం సాధిస్తామని పేర్కొన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా నేడు 162వ రోజు తుమ్మిడిహట్టిలోని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పరిశీలించిన ఆయన,నావలో నీళ్లలోకి వెళ్లి మీడియాతో మాట్లాడారు. అనంతరం గురుడుపేట్ గ్రామంలో కొమురంభీం విగ్రహాన్ని ఆవిష్కరించారు.ప్రభుత్వం ఆసిఫాబాద్ జిల్లాకు కొమురం భీం పేరు పెట్టి,మరో ప్రక్క ఆయన ఆశయాలకు విరుద్దంగా నీళ్లు ఇవ్వకుండా,తమ భూములకు పట్టాలివ్వకుండా, అడవిపై హక్కులు లేకుండా కాలరాస్తున్నారని మండిపడ్డారు.భూమి కావాలని అడిగితే మహిళలను విపరీతంగా కొట్టి,బాలింతలను కూడా జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే కొమురం భీం ఆశయాలు నెరవేరుతాయని,పేదల భూములకు పట్టాలు వస్తాయని,సాగునీరు అందుతుందని,అటవీ అధికారుల దాడులు ఉండవని తెలిపారు.కాబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా బిఎస్పి పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి,సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జి అర్షద్ హుస్సేన్,నియోజకవర్గ నాయకులు ప్రవీణ్ కుమార్,మహిళా నాయకురాలు జ్యోతి,గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.