నవతరం

తెలుగు దినపత్రిక

సిర్పూర్ లో 16న బహిరంగ సభ

*ఖమ్మం సభే..బిఆర్ఎస్ చివరి సభ
* డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ.


హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: బిఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించబోయే సభే, ఆ పార్టీకి చివరి సభ అని డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సభ కోసం స్థానిక రైతులకు చెందిన పంటలను ధ్వంసం చేసి,వారికి అన్యాయం చేయడం ఏంటని ఆయన మండిపడ్డారు.టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ వంటి ఎన్ని అవతారాలెత్తిన ప్రజలు ఆ పార్టీకి విఆర్ఎస్ ఇవ్వడం పక్కా అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి ఏ రాష్ట్రంలో కూడా ఆహ్వానం అనుమతి లేదని,అన్ని పార్టీలు బిఆర్ఎస్ పార్టీని చూసి తలుపులు మూసేస్తున్నారని ఎద్దేవా చేశారు.దేశ ప్రజలు సంపద దోచుకునే పార్టీలు కోరుకోవడం లేదని,సంపదను సమానంగా పంచే పార్టీలను కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా నేడు 164వ రోజు యాత్ర బెజ్జూర్ మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సిర్పూర్ నియోజకవర్గంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు.ప్రాణహిత పేరుతో ప్రజల భూములు గుంజుకున్నారని,ప్రాజెక్టు కట్టకుండా,రైతులకు తిరిగి భూములివ్వకుండా మోసం చేసి,రీ డిజైన్ పేరుతో,కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి,వందల కోట్ల కమీషన్లు దోచుకున్నారని తెలిపారు.పోడు భూములకు పట్టాలు ఇవ్వమంటే సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. బెజ్జూరులో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పి మోసం చేశారన్నారు.బస్టాండ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి యాదిమరిచారన్నారు.మండల కేంద్రంలో కనీసం డిగ్రీ కళాశాల పెట్టలేని చేతకాని ఎమ్మెల్యే మనకెందుకని విమర్శించారు.సిర్పూర్ నియోజకవర్గంలోని వనరులను దోచుకొని కోట్ల రూపాయల ఆస్తులు ఆంధ్ర ప్రాంతపు కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారని గుర్తుచేశారు.ఎమ్మెల్యే అనుచరులు నోటిఫైడ్ భూములు,ఆదివాసీ భూములను గుంజుకోవడాన్ని వ్యతిరేకించారు.ఈ సమస్యలన్నింటిపై సమరశంఖం పూరించి,ఎమ్మెల్యే కోనేరుకోనప్పను ఓడించడమే లక్ష్యంగా ఈ నెల 16న కాగజ్ నగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.మహాత్మ ఫూలే,చత్రపతి శీవాజి,అంబేడ్కర్ మహనీయుల ఆశయాలను నెరవేర్చే ఏకైక పార్టీ బిఎస్పి అని తెలిపారు.కాబట్టి ఎస్సీ,ఎస్టీ,బిసి మైనారిటీ ప్రజలంతా ఒక్కటై బహుజన రాజ్యాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు.బిఎస్పి పార్టీ గెలిస్తే,భూమిలేని ప్రతి నిరుపేద కుటుంబానికి కనీసం ఎకరం భూమి వస్తుందని,పది లక్షల ఉద్యోగాలు వస్తాయని,పేదవర్గాల పిల్లలు విదేశాల్లో చదివే అవకాశాలు వస్తాయని,పోడు భూములు,అసైన్డ్ భూములకు పట్టాలు వస్తాయని ప్రకటించారు. ఈ రోజు యాత్ర బెజ్జూరు మండలంలోని పోతపల్లి, కోర్తగుడ,కుకుడ,బెజ్జూరు,సలుగుపల్లిలో కొనసాగింది. యాత్రలో రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి,నియోజకవర్గ ఇంచార్జి అర్షద్ హుస్సేన్,నియోజకవర్గ అధ్యక్షులు రాంప్రసాద్,మహిళా నాయకురాలు జ్యోతి,ప్రవీణ్ కుమార్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading