నవతరం

తెలుగు దినపత్రిక

ఫీజు రియంబర్స్ మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలి

* బహుజనున్ని సిఎం చేసేదాక నిద్రపోం
* డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ

బోయినిపల్లి / చొప్పదండి / రాజన్న సిరిసిల్ల, నమస్తే ఎల్లంపల్లి: తెలంగాణ రాష్ట్రానికి ఒక బహుజనున్ని సిఎం చేసి, ప్రగతిభవన్ లో కూర్చోబెట్టేదాక నిద్రబోమని డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఇంకెంతకాలం బహుజనులు కూలీలుగానే బతకాలని, వేల కోట్ల రూపాయల బడ్జెట్ పేదలకు ఎందుకు అందడంలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో యాభై శాతం ఉన్న బిసిలకు, లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాల్సిన చోట కేవలం, ఆరువేల కోట్లు మాత్రమే ఇచ్చి అన్యాయం చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ ఇవ్వకుండా విద్యకు దూరం చేయాలని కుట్ర చేస్తుందన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం 5వేల బకాయిలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు.వెంటనే ప్రభుత్వం ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పేదలకు ఇలాగే అన్యాయం జరుగుతుందన్నారు. దేశంలో నలభై శాతం సంపద ఒక్క శాతం ప్రజల చేతిలోనే ఉందన్నారు. అందుకే సంపద సమానంగా పంచబడాలంటే అన్ని వర్గాల ప్రజలు అభివృద్ది చెందాలంటే బహుజన రాజ్యం రావాలన్నారు. విద్యుత్ చార్జీలు పెంచి పేద ప్రజల నుండి ఎసిడి పేరుతో అధికంగా బిల్లులు వసూలు చేయడాన్ని డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాలోచితంగా ఏకపక్ష నిర్ణయాల వల్లనే నేడు పేద ప్రజల గుడిసెలకు వినియోగం కంటే అధికంగా బిల్లులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లో రెండవ దశ మెట్రో పనులకు వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం గ్రామాల్లో రోడ్లు ఎందుకు వేయుచడంలేదని ఆయన ప్రశ్నించారు. కేవలం ఆధిపత్య వర్గాల కోసం, కమీషన్ల కోసమే మెట్రో రెండవ దశ పనులు చేపట్టారని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటి నుండి విమానాశ్రయానికి పేదలు వెళ్లడం లేదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ముఖ్యమంత్రి ఫాంహౌస్ కోసం మాత్రమే నిర్మించారని గుర్తుచేశారు. కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా ఫాంహౌస్ లోకి నీరు తెచ్చుకోవడానికి లక్షల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా నేడు 166వ రోజు నేడు చొప్పదండి నియోజకవర్గంలోని బోయినిపల్లి మండలంలో గల తడగొండ, కోరెం, స్తంభంపల్లి, బోయినిపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అంకని బాబు,దొడ్డె సమ్మయ్య, నియోజకవర్గ అధ్యక్షులు మాంకాలి. తిరుపతి, నియోజకవర్గ ఇంచార్జి కొంకటి. శేఖర్, రవీందర్, మహిళా జోనల్ కన్వీనర్ స్వరూప, నియోజకవర్గ కన్వీనర్ అనూష, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్, మండల నాయకులు మహేందర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading