నవతరం

తెలుగు దినపత్రిక

మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయండి

* మెడికల్ కాలేజీ ఏర్పాటు.. ఆశా పోస్టుల భర్తీ.. న్యూట్రిషన్ కిట్లు.. తదితర అంశాలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తావన
* సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ రావు.. త్వరలోనే వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ
* కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ / హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ బస్తీ దవాఖానాల్లో సేవలు, మెడికల్ కళాశాల ఏర్పాటు, ఆశా పోస్ట్ ల భర్తీ తదితర అంశాలపై ప్రస్తావించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే మహోన్నత లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు.

బస్తీ దవాఖానల్లో మందులు ఏ విధంగా అందుబాటులో ఉన్నాయని? ఎన్ని రకాల పరీక్షలు చేస్తున్నారని? జిహెచ్ఎంసి ప్రాంతంలో జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఆశా పోస్టులు ఖాళీలు ఉన్నాయా అని? ఎన్ని పెంచే యోచన ఉందని? జనాభా ప్రాతిపదికన వెంటనే ఖాళీలు భర్తీ చేయాలని రాష్ట్ర ఆర్థిక & వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ను కోరారు. పేదలు బరించలేని ఖరీదైన లిక్విడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలు బస్తీ దవాఖానల్లో ఉచితంగా చేస్తున్నారా? 57 రకాల పరీక్షలు చేస్తున్న మాట వాస్తవమేనా? ప్రభుత్వం 134 రకాల పరీక్షలు పెంచేందుకు ఆలోచన చేస్తున్న మాట వాస్తవమేనా? అయితే ఎప్పటిలోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారని మంత్రి హరీష్ రావు ను సభాపతి ద్వారా అడిగారు. అదే విధంగా ఆదివారం సెలవు దినం కావడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజలు ఇళ్ళ వద్ద ఉంటారని, ఆదివారం బస్తి దవాఖానలకు సెలవు ఇవ్వకుండా అందుబాటులో ఉంచితే ప్రజలకు సేవలు అందుతాయని అందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పేద ప్రజలకు స్థానికంగా బస్తీ దవాఖానల ఏర్పాటు వల్ల ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రుల్లో ఓపి ఒత్తిడి తగ్గిందా అని అడిగారు? తద్వారా మేలు చేకూరుతుందా అని అడిగారు. 9 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్లు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో ఎప్పుడు అందించనున్నారని? ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలతో పాటు బయోమెట్రిక్స్ టైమింగ్స్ ఏర్పాటు చేసిన విధంగా బస్తీ దవఖానాల్లో ఏర్పాటు చేసే ఆలోచన ఉందా అని అడిగారు. మేడ్చల్ జిల్లాలో మెడికల్ కాలేజీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 20 ఎకరాల హెచ్ఎంటి స్థలాన్ని గుర్తించామని అందులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావు ను కోరారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అవసరమైన ప్రాంతాల్లో బస్తీ దవాఖానలు ఉన్నాయని, అయితే గాగిల్లాపూర్ గ్రామంలో పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉన్న భవనంలో బస్తీ దవాఖాన ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ని కోరారు.

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి హరీష్ రావు సమాధానాలు ఇస్తూ..
బస్తీ దవఖానాల్లో 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన అతి ఎక్కువ ఖాళీలు మేడ్చల్ జిల్లాలో ఉన్నాయని, మేడ్చల్ జిల్లాలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆశా పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న 1540 ఆశ పోస్టులను త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేస్తామని అన్నారు. అందులో మేడ్చల్ జిల్లాలో 974, హైదరాబాదులో 323, రంగారెడ్డి జిల్లాలో 243 పోస్టులు ఈ నెలలోగానే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 800 రూపాయలు ఖర్చు అయ్యే లిక్విడ్, థైరాయిడ్ పరీక్షలను బస్తీ దవఖానాల్లో పేద ప్రజలకు ఉచితంగా చేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు లిక్విడ్ ప్రోఫైల్ పరీక్షలు లక్షా 47 వేల మందికి చేశామని దాదాపు 12 కోట్ల రూపాయల పేద ప్రజల ధనాన్ని ఉచితంగా చేయడం ద్వారా ఆదా చేయడం జరిగిందని అన్నారు. థైరాయిడ్ పరీక్షలు 1,00,868 మందికి ఉచితంగా చేయడం జరిగిందని దీని ద్వారా దాదాపు 8 కోట్ల రూపాయల ధనాన్ని పేద ప్రజలకు ఆదా చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం చేస్తున్న 57 రకాల పరీక్షలే కాకుండా 134 టెస్టులు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని, పరికరాలను కొనుగోలు చేస్తున్నామని, త్వరలోనే వాటిని బస్తీ దవఖానాలకు అందుబాటులోకి తీసుకువచ్చి మార్చి వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని అన్నారు. బస్తీ దవఖానాలకు శనివారం సెలవు దినం ప్రకటిస్తూ ఆదివారం పని చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తద్వారా ఆదివారం ఇళ్ల వద్ద ఉండే ప్రజలకు వైద్య సేవలు అందనున్నాయన్నారు. బస్తీ దవాఖానల ఏర్పాటు వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, బస్తీ దవఖానాలు అందుబాటులో లేనప్పుడు ఉస్మానియాలో 2019లో 12 లక్షల ఓపీ ఉంటే.. 2022 లో 5 లక్షలకు తగ్గిందని అన్నారు. గాంధీలో 2019లో 6.50 లక్షల ఓపీ ఉంటే.. 2022 లో 3.70కి తగ్గిందన్నారు. నిలోఫర్ 2019లో 8 లక్షల ఓపీ ఉంటే.. 2022 లో 5.30, ఫీవర్ 2019లో 4 లక్షల ఓపీ ఉంటే.. 2022 లో 1.12 కి తగ్గిందని అన్నారు. బస్తీల్లో దవాఖానాలు అందుబాటులోకి రావడం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఆయా ఆసుపత్రుల్లో ఓపీలు తగ్గాయన్నారు. బస్తీ దవఖానాలు ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు 1 కోటి మంది వైద్య సేవలు అందుకున్నారని అన్నారు. కొత్త బడ్జెట్ లో 200 కోట్లు పొందుపరచామని, న్యూట్రిషన్ కిట్లు ఏప్రిల్ నెలలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తామని అన్నారు. ఇప్పటికే టీచింగ్ ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురావడం జరిగిందని, పీహెచ్ సీలలో సీసీ కెమెరా విధానాన్ని తీసుకువచ్చామని రాబోయే రోజుల్లో బస్తీ దవఖానల్లో తీసుకువచ్చి సమయపాలన పాటించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం ప్రకారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో హెచ్ఎంటీ స్థలంలో మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గాగిల్లాపూర్ గ్రామంలో అదనంగా బస్తీ దవాఖానను ఈరోజు రేపట్లో ఏర్పాటు చేసేలా ఉత్తర్వులు జారీ చేస్తానని అన్నారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అవసరమైన బస్తీ దవాఖానలు మంజూరు చేసినందుకు, త్వరలో మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని, గాగిల్లాపూర్ గ్రామంలో తక్షణమే బస్తీ దవాఖాన మంజూరు చేసినందుకు మంత్రి తన్నీరు హరీష్ రావు కు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ధన్యవాదాలు తెలిపారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading