నవతరం

తెలుగు దినపత్రిక

ఇలా వచ్చి అలా వెళ్లిన మాజీ సీఎం కేసీఆర్

* అసెంబ్లీలో మూడు నిమిషాలు కూడా ఉండలేకపోయిన కెసిఆర్!

హైదరాబాద్, డిసెంబర్ 29, నవతరం: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమ య్యాయి చాలా కాలం తర్వాత అసెంబ్లీ సమావేశాలకు హాజరైన బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ కేసీఆర్, సభకు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి సభలో జాతీయగీతం ఆలాపన అయిపోగానే బయటకు వెళ్లిపోయారు.సభలో ఆయన మూడు అంటే మూడే నిమిషాలు ఉన్నారు కనీసం దివంగత సభ్యుల సంతాప తీర్మానం కూడా వినలేదు..

చాలా కాలం తర్వాత ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు,అసెంబ్లీకి హాజరుకావడం, మూడు నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండకపోవడం  విశేషం. సభ ప్రారంభమైన వెంటనే దివంగత మాజీ ఎమ్మెల్యే లు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సభ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా అసెంబ్లీ హాల్‌లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ కూర్చున్న సీటు వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు.

ఆయన్ను పలకరించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సైతం కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ అటండెన్స్ రిజిస్టర్‌లో సంతకం పెట్టి సభ నుంచి వెళ్లిపోయారు.

ప్రస్తుతం సభలో జీరో అవర్ నడుస్తుండగా.. ఆ తర్వాత ప్రభుత్వం పలు కీలక బిల్లులు, ఆర్డినెన్సులను ప్రవేశపెట్టి వాటికి చట్టబద్ధత కల్పించనుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర ముఖచిత్రాన్ని మార్చే విధంగా జీహెచ్‌ఎంసీ పరిధి లోని ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న మున్సిపాలిటీలను విలీనం చేసే బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

దీనివల్ల జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరించడమే కాకుండా వార్డుల సంఖ్యను కూడా 150 నుంచి 300కి పెంచ నున్నారు. అంతేకాకుండా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉన్న ‘ఇద్దరు పిల్లల నిబంధన’ను తొలగించే చారిత్రాత్మక నిర్ణయానికి ఈ సభలో ఆమోదం లభించ నుంది. తెలంగాణ జీఎస్‌టీ సవరణ, ఉద్యోగుల హేతు బద్ధీకరణ, పంచాయతీరాజ్ చట్ట సవరణ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం చర్చించనుంది.

ఈ సభలో ప్రధానంగా కృష్ణా, గోదావరి నదీ జలాలపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోం ది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ వ్యవహారం ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చు పెట్టింది. ఈ పథకానికి కేవలం 45 టీఎంసీల కేటాయింపులు మాత్రమే కోరడం తెలంగాణకు నష్టమని భారాస ఆరోపిస్తుండగా.. తాము మొత్తం 90 టీఎంసీల కోటా కోసం ప్రయత్నిస్తూనే, తక్షణ అనుమతుల కోసం 45 టీఎంసీల ప్రతిపాదన పెట్టామని ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది.కేంద్రం ఈ డీపీఆర్‌ను వెనక్కి పంపడంపై ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో సభలో కీలక వాదనలు వినిపించనున్నాయి.

తొలిరోజు సమావేశాల అనంతరం.. ఉభయ సభలు వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడే అవకాశం ఉంది. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి, 31న ఏడాది ఆఖరు, జనవరి 1న నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మూడు రోజుల పాటు సభకు విరామం ప్రకటించనున్నారు. కాసేపట్లో జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ  సమావేశంలో సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించా లనే దానిపై స్పష్టత రానుంది.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading