కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో రెచ్చిపోతున్న కబ్జాదారులు
ఏకంగా 250 ఎకరాలకు ఎసరు పెట్టిన కేటుగాళ్లు
ఏపీ ఎస్ఎఫ్సి భూములను మాయం చేసే పనిలో నిమగ్నమైన కబ్జాదారుడు
అమాయకులను అడ్డం పెట్టుకొని ఒక బస్తిని ఏర్పాటు చేసిన వైనం
గతంలో కూల్చివేతలు చేసిన అధికారులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు
30 ఇండ్లు కూల్చివేస్తే 300 ఇండ్లు నిర్మించిన కబ్జాదారులు
నిద్రమత్తులో ఏపీ ఎస్ఎఫ్సి అధికారులు
ఏపీ ఎస్ఎఫ్సి సెక్యూరిటీ కనుసనల్లో అక్రమ నిర్మాణాలు
కేసులు నమోదు చేసిన బుద్ధి మార్చుకోని కబ్జాదారులు
వార్తలు రాస్తున్న విలేకరుల పైన దాడులకు తెగబడ్డ వైనం
ఎవరి అండతో ఇంతగా రెచ్చిపోతున్నారు
డివిజన్ కార్పొరేటర్ కి కనిపించడం లేదా…?
పట్టపగలే అక్రమ నిర్మాణాలు… నిద్రమత్తులో అధికారులు
చర్యలు తీసుకోవాలంటున్న స్థానిక ప్రజలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో పాగా వేసిన కొందరు భూకబ్జాదారులు ఎంతకైనా తెగిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వ భూములను ప్లాట్ లుగా మార్చి లక్షలు, కోట్లు దండుకుంటుండగా… మరోవైపు విలేకరులపై దాడులకు తెగబడుతున్నారు. గాజులరామారం డివిజన్ దేవేందర్ కు ఆనుకుని వున్న సర్వే నంబర్ 329/1, 307 లోని సుమారు పదెకరాల ప్రభుత్వ, ఏపీఎసెఫ్సీ భూములను ఆక్రమించి అందులో అక్రమ ఇండ్లను నిర్మించి గాలిపోచమ్మ బస్తీని నెలకొల్పాడో కబ్జాదారుడు. రోజూ కూలి చేసుకుని జీవనం సాగించే ఇతగాడు.. ప్రస్తుతం ఓ బస్తీకే బాస్ అయ్యాడు. అంతేకాకుండా గాలిపోచమ్మ గుడికి చైర్మన్ కూడా… ఇదంతా ఎలా సాధ్యమయ్యింది… అనే అంశాలతో ప్రత్యేక కథనం…
నవతరం తెలుగు దినపత్రికలో ప్రచురించిన వార్త కథనం
కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 9 (నమస్తే ఎల్లంపల్లి): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజులరామారం సర్వే నంబర్ 329/1, 307 లోని ప్రభుత్వ, ఏపీ ఎస్ఎఫ్సి భూములు మాయం చేసే పనిలో గత మూడు సంవత్సరాలుగా నిమగ్నమయ్యారు కొందరు భూకబ్జాదారులు. 307 సర్వే నంబర్లో వెలసిన గాలి పోచమ్మ బస్తీ ఇప్పటికే సుమారు 10 ఎకరాల భూమి మాయం చేసింది. ఈ బస్తీలో నాయకుడిగా చెలామణి అవుతున్న ఒక కబ్జాదారుడు ఇప్పటికే సుమారు 10 కోట్ల రూపాయలు దండుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ, ఏపీ ఎస్ఎఫ్సి భూములను ఆక్రమించి, అమాయక పేద ప్రజలను అడ్డం పెట్టుకొని, ఒక్కో ఫ్లాటును ఐదు లక్షల రూపాయల నుంచి 10 లక్షల వరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడు ఈ కబ్జాదారుడు. ఈ కబ్జా బాగోతంలో కొందరు బంధువులను, స్నేహితులను కలుపుకొని అటువైపు ఎవరు రాకుండా చూసుకుంటాడు. ఒకవేళ ఈ భూకబ్జాల తతంగాన్ని వెలికి తీసే ప్రయత్నంలో ఎవరైనా వార్త పత్రికల, న్యూస్ ఛానల్ల విలేకరులు వీరి కంటపడితే చాలు… భౌతిక దాడులకు ఏమాత్రం వెనుకాడరు. దీనికి ప్రధాన కారణం అడ్డదిడ్డంగా సంపాదించిన డబ్బులేనంటున్నారు స్థానిక ప్రజలు. ఇప్పటికే కొందరు విలేకరుల పైన దాడులు చేసిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి.
అర్ధరాత్రిల్లు, పట్టపగలు అని తేడా లేకుండా సర్వే నంబర్ 307 లో ఉన్న ఒక పెద్ద క్వారీని పూడ్చివేసి అందులో 60, 80, 100 గజాల చొప్పున ప్లాట్లు ఏర్పాటు చేసి అమాయక పేద ప్రజలకు అంటగట్టారు. గత మూడు సంవత్సరాల క్రితం రోజు కూలి చేసుకొని జీవనం కొనసాగించే ప్రస్తుత కబ్జాదారులు ప్రభుత్వ భూమి కంటపడేసరికి ఉన్నపలంగా కోటీశ్వరులు అయ్యారు. ఈ ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలకు కరెంటు మీటర్లు మంజూరు చేయడంలో తమ తెలివిని ప్రదర్శిస్తున్నారు విద్యుత్ అధికారులు. ఒక్కో కరెంట్ మీటర్ కి సుమారు 7000 నుంచి పదివేల రూపాయలు వసూలు చేస్తూ, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారు విద్యుత్ అధికారులు. ఇక్కడి భూ కబ్జాలపై ఎన్ని వార్తా కథనాలు ప్రచురితమైనా అవి మాత్రం ఇక్కడి విద్యుత్తు అధికారులకు కనిపించవు. గతంలో ప్రభుత్వ భూమిలో అడుగు పెట్టాలంటే భయపడే భూ కబ్జాదారులు పట్టపగలే ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటే ఎంతగా బరితెగించారో ఇట్టే అర్థమవుతుంది. ఇకనైనా మేడ్చల్ మల్కాజ్గిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కల్పించుకుని ఈ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి, ఇక్కడి భూకబ్జాదారులపై పీడీ యాక్ట్ లు నమోదు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
శెనార్తి తెలంగాణ తెలుగు దినపత్రికలో ప్రచురించిన వార్తా కథనం
మౌనోవ్రతంలో సంబంధిత అధికారులు పట్టపగలే ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే… స్థానిక రెవెన్యూ అధికారులు ఏమీ తెలియనట్టు ఎందుకు మౌనంగా ఉంటున్నారు. కటిక పేదవాడు ప్రభుత్వ భూమిలో ఒక చిన్న గుడిసె వేసుకుంటేనే నానా హంగామా చేసే రెవెన్యూ అధికారులు… ఇక్కడి కబ్జాదారులు కొన్ని వందల సంఖ్యలో అక్రమ ఇండ్ల నిర్మానాలు జరుపుతున్నా చూసీ చూడనట్టు ఎందుకు మౌనంగా ఉంటున్నారని స్థానిక ప్రజలు పాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఏపీ ఎస్ఎఫ్సీ అధికారులు… అసలు ఆ భూములు వారివి కానట్టు, తమకు సంబంధం లేనట్టు అటువైపు రావటమే మర్చిపోయారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి కబ్జాదారుల భరతం పట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
You must be logged in to post a comment.