నవతరం

తెలుగు దినపత్రిక

సిండి ‘కేటు’ మాయాజాలం

• అడ్డంగా దండుకుంటున్న లిక్కర్ డాన్
• ఎక్సైజ్ శాఖ అధికారుల కనుసన్నల్లోనే దందా!
• హోల్‌సేల్‌ పేరిట.. అధిక ధరలకు లిక్కర్‌ విక్రయాలు
• బెల్ట్‌షాపుల్లో ఏరులై పారుతున్న కల్తీ మద్యం అమ్మకాలు
• ఇక్కడ సిండికేట్ వ్యాపారులు చెప్పిందే ధర!
• వంతుల వారీగా అమ్మేసుకుంటున్న వైనం, ఎనిమిది షాపుల వ్యాపారాలు ఒకే చోట పంపకాలు
• ఈ బడా వ్యాపారులపై చర్యలు ఉండవా??
• నామమాత్రపు తనిఖీలు, బైండోవర్ కేసులు
• లిక్కర్ మాఫియాకు అడ్డుకట్ట పడేది ఎప్పుడు?

భద్రాద్రి జిల్లా, నమస్తే ఎల్లంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక లాభాలు వచ్చే బిజినెస్ ఏదైనా ఉందా..అంటే అది మద్యం వ్యాపారమని చెప్పుకోవచ్చు ఎందుకంటే దానిపై వచ్చే లాభాలు అలా ఉన్నాయి మరి. గత కొన్నేళ్లగా అడ్డదారుల్లో డబ్బు ఎలా సంపాదించాలి అనుకున్న కొంతమంది కేటుగాళ్లు మద్యం వ్యాపారం అయితే లాభాలు బాగా వస్తాయని ముందుగానే గమనించి కొత్తగూడెం కేంద్రంలో తన సిండికేట్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనిలో భాగంగా కొత్తగూడెంలో లిక్కర్‌ దందాను దక్కించుకున్న వ్యాపారులు అధిక లాభాలను రాబట్టుకునేందు కు సిండికేటుగా మారి అడ్డదారి సంపాదనకు ఎగబడుతున్న వారందరినీ ఒకే దగ్గర చేర్చి ఒక ఆఫీసులో కూర్చుని అందరినీ సెటిల్ చేస్తాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కేంద్రంలో సిండికేట్ కేటుగాళ్ల దందా మూడు బీర్లు.. ఆరు ఫుల్లులుగా నడుస్తోంది…కొత్తగూడెంలో లిక్కర్‌ దందాను దక్కించుకున్న వ్యాపారులు అధిక లాభాలను రాబట్టుకునేందు కు సిండికేటుగా మారి అడ్డదారి సంపాదనకు ఎగబడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మద్యం దుకాణాల్లో జరుగుతున్న అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం సరిపోదంటూ.. జిల్లా కేంద్రం చుట్టుపక్కలున్న పంచాయతీలు, గ్రామాలలో బెల్ట్‌షాపులపై కన్నేస్తున్నారు. కొన్ని గ్రామాల్లోనైతే వైన్స్‌షాపులకు దీటుగా బెల్టు శాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే సిండికేటుగా ఏర్పడిన వ్యాపారులు వంతుల వారీగా బెల్ట్‌షాపులకు మద్యాన్ని తరలిస్తున్నారు. కొత్తగూడెం ఓ బడా సిండికేట్ వ్యాపారి కనుసన్నల్లో నడుస్తోంది. గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణ, రేట్ ఫిక్స్ ఇలా అన్ని వారి కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. ఎవరికి ఎంత ఇవ్వాలనేది కూడా వారే నిర్ణయిస్తారట. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం కేంద్రమే కాక చుట్టుపక్కలున్న మండలాల్లో సిండికేట్ వ్యాపారాన్ని అధికారులు పట్టించుకోకపోవడానికి ఆ బడా వ్యాపారే కారణమని తెలుస్తుంది. తమ చెప్పుచేతల్లో ఉండే అధికారులకు అడిగినంత ముట్టజెబుతూ తమ మాఫియాను పదిలంగా కాపాడుకుంటున్నారు. నెలనెలా డబ్బు ఆశచూపుతున్న మామూళ్లకు అలవాటు పడి అధికారులు బెల్ట్‌షాపుల వైపు కన్నెత్తయినా చూడడం లేదంటున్నారు ఇక్కడి జనం. కల్తీ మద్యంతో సామాన్య జనం ఒళ్లు గుళ్ల చేసుకుంటున్నా.. అధికారులకు పట్టింపే లేనట్లు కనిపిస్తుంది. అసలు నిబంధనల ప్రకారం వైన్స్‌షాపుల నుంచి రిటైల్‌ తప్ప హోల్‌సెల్‌ విక్రయాలను జరుపరాదు. కానీ విచ్చలవిడిగా మద్యాన్ని కల్తీ చేస్తూ బెల్ట్‌షాపులకు అంటగడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొత్తగూడెంలో లైసెన్స్‌ పొందిన 8 వైన్స్‌షాపులు ఉన్నాయి. కాని అనధికారికంగా వెయ్యికి పైగా బెల్ట్‌షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అధికారులు టార్గెట్‌ల పేరిట మద్యం సేల్స్‌పై చూపుతున్నంతగా.. కల్తీ మద్యం కట్టడిపై ఆసక్తి చూపడం లేదన్న విమర్శలున్నాయి.

ఇప్పటికే సిండికేటుగా ఏర్పాటు చేసిన జిల్లా మద్యం వ్యాపారి లిక్కర్‌ దందాను తన గుప్పిట్లో పెట్టుకుని విచ్చలవిడిగా విక్రయాలు జరుపుతున్నారు. దొరికితే దొంగ.. లేదంటే దొర అన్న చందంగా లిక్కర్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. లూజు అమ్మకాలను జరుపరాదనే నిబంధనలు ఉన్నా.. అవి ఎక్కడా పాటించినట్లు కనిపించడం లేదు. పగలంతా రిటైల్‌గా అమ్మకాలు జరుపుతూ రాత్రి వేళల్లో హోల్‌సెల్‌ విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కొత్తగూడెం కేంద్రాలలో కల్తీ దందా జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారుల తనిఖీలు కొరవడడంతో వ్యాపారులదే ఆడింది ఆట, పాడింది పాటగా నడుస్తోంది. అడపాదడపగా పట్టుబడుతున్నా.. సులువుగానే బయట పడుతున్నట్లు తెలుస్తుంది. నెలనెలా మామూళ్లు ముట్టచెప్పడంతోనే అధికారులు అటువైపు కన్నెత్తయినా చూడడం లేదంటున్నారు. అడిగినంత ఇస్తే సరే లేదంటే నిబంధనల పేరిట కొర్రీలు పెట్టడం, అవసరమైతే కేసులను కూడా నమోదు చేసేందుకు అధికారులు వెనుకాడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వ్యాపారులు, అధికారులు కుమ్మకై సామాన్య జనం నడ్డివిరుస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో ఈ కల్తీ మద్యం సేవించి చాలామంది యువకుల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయనే సంగతి అందరికీ తెలిసిందే.

అడ్డగోలుగా దోపిడీ
ఊరువాడల్లో పోటీ పడి మరీ ఏర్పాటు చేస్తున్న బెల్ట్‌షాపుల్లో అడ్డగోలుగా దోపిడీ జరుగుతుంది. మద్యం షాపుల నుంచి హోల్‌సేల్‌గా మద్యాన్ని తీసుకెళ్తూ బెల్ట్‌షాపు యజమానులు అధిక ధరలకు అమ్మేస్తూ దండుకుంటున్నారు. అలాగే లూజు అమ్మకాలతో అదనపు ఆదాయం కోసం ఆరాటపడుతున్నారు. వీడీసీలు నిర్వహించే టెండర్లను దక్కించుకుంటున్న వ్యాపారులు బహిరంగంగానే అధిక ధరలకు అమ్ముతున్నా.. ఎక్సైజ్‌ శాఖ అధికారులు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. వీడీసీల కట్టుబాట్లతో ఫిర్యాదు చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. గ్రామ వీడీసీల కు బెల్ట్‌షాపులు మంచి ఆదాయమార్గంగా మారడంతో నోరు మెదుపడం లేదంటున్నారు. ఒక్కో క్వాటర్‌కు రూ.10 నుంచి రూ.20, అలాగే బీర్‌ బాటిల్‌కు రూ.10 చొప్పున అధిక ధరలకు విక్రయిస్తున్నారు. జిల్లాలో బెల్ట్‌షాపుల దందా ఓ మాఫియాను తలపిస్తున్నా.. ఉన్నతాధికారులు మౌనం వహించడం వెనుక అసలు మతలబు ఏమిటో అంతుచిక్కడం లేదు. అనధికారికంగా ఉన్నతాధికారులే బెల్ట్‌ జోలికి వెళ్లవద్దంటూ ఆదేశించడంతో జిల్లా అధికారులు కార్యాలయాలకే పరిమితమవుతున్నట్లు తెలుస్తుంది. అడపాదడపాగా తనిఖీలు నిర్వహించి, పొరపాటున కేసులు నమోదు చేస్తే ఉన్నతాదికారుల నుంచి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలు ఎక్సైజ్‌ శాఖ అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదంతా అక్రమ దందానేనని అందరికీ తెలిసినా.. అడ్డుకోకపోవడంతో అమాయక జనం తీవ్రంగా నష్టపోతున్నారు. అనారోగ్యం బారీనపడి ఆసుపత్రుల పాలవుతున్నారు. కల్తీ మద్యం కాటుకు బలై ఎన్నో కుటుంబాలు ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి అనాథగా మారుతున్నాయి.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading