నవతరం

తెలుగు దినపత్రిక

ఒంటరి ప్రయాణికులే టార్గెట్‌.. దుండగుల ముఠా అరెస్ట్

బాలానగర్, నవతరం: ఒంటరిగా ప్రయాణిస్తున్న వారిని కత్తులతో బెదిరించి బంగారం, నగదు, మొబైల్ ఫోన్లు దోచుకుంటున్న కిరాతక ముఠాను సీసీఎస్ బాలానగర్ పోలీసులు అరెస్టు చేసినట్లు క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి తెలిపారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 19న మధ్యాహ్నం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోటరీ 1 వద్ద ప్రైవేట్ ఉద్యోగి సునీల్ కుమార్ కారులో ఆగి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారన్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని సీసీఎస్ బాలానగర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టారన్నారు. డిసెంబర్ 8న అదే ప్రాంతంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టైన వారు గురుదార్ సింగ్ అలియాస్ గురు సింగ్, షేక్ నాగుల్ మీరా అలియాస్ గోరీ, కోట అఖిల్ కుమార్ అని వెల్లడించారు. విచారణలో నిందితులు మొత్తం 17 కేసుల్లో పాలుపంచుకున్నట్లు అంగీకరించారన్నారు. అందులో దోపిడీలు, బెదిరింపులు, వాహన దొంగతనాలు ఉన్నాయని చెప్పారు. నిందితుల వద్ద నుంచి రెండు హీరో స్ప్లెండర్ ద్విచక్ర వాహనాలు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా డిసిపి ప్రజలకు పలు సూచనలు చేశారు. ఒంటరి ప్రదేశాల్లో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ సూచించారు. ఈ అరెస్టులు ఏడీసీపీ క్రైమ్స్ రామ్ కుమార్, ఏసీపీ నాగేశ్వరరావు మార్గనిర్దేశంలో, సీసీఎస్ బాలానగర్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ బృందం చేపట్టినట్లు తెలిపారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading