హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్లు జారీ చేసే విషయంలో ప్రభుత్వం, మీడియా అకాడమీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్నా ఇప్పటివరకు అక్రెడిటేషన్‌లకు సంబంధించిన మార్గదర్శకాలు, జీవో జారీ చేయకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు. మార్గదర్శకాల రూపకల్పన పేరుతో కమిటీలు వేసుకుంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఈ విధంగా ముందుకు సాగితే మరో రెండు సంవత్సరాలు అయినా కొత్త అక్రెడిటేషన్‌లు జారీ అవుతాయా అనే అనుమానం జర్నలిస్టుల్లో నెలకొందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన కార్డులను మూడు నెలలకు ఒకసారి గత సంవత్సర కాలంగా పొడిగిస్తూ స్టిక్కర్లు అంటించుకుని తిరగడం జర్నలిస్టుల పరిస్థితి ఏ స్థాయికి చేరిందో స్పష్టమవుతోందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో 23 వేల అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయగా, ప్రస్తుతం వాటి సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తోందన్న అనుమానం జర్నలిస్టుల్లో నెలకొన్నదని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు అక్రెడిటేషన్ ఉండాలని అప్పుడు ఇస్తే ఇప్పుడు వాటిని ఏ విధంగా కోతపెట్టాలనే ఆలోచన చేస్తుండటం వల్లే ఈ ఆలస్యం జరుగుతుందనే చర్చ జర్నలిస్టుల్లో నెలకొందని వారు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ రానుండటం, ఒకదాని తర్వాత ఒకటి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కార్డుల జారీ ప్రక్రియపై ఎలాంటి స్పష్టత లేకపోవడం విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మరో నెల రోజులు గడిస్తే మరో స్టిక్కర్ వేసుకోవాల్సిన దుస్థితి జర్నలిస్టులకు వస్తుందన్నారు. చిన్న పత్రికల జర్నలిస్టులు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎంపానెల్మెంట్, అప్‌గ్రేడేషన్‌లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు అంశాలపై తక్షణమే సమాచార శాఖ మంత్రి, మీడియా అకాడమీ చైర్మన్, కమిషనర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే పరిష్కార చర్యలు చేపట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.



































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































