నవతరం

తెలుగు దినపత్రిక

హైడ్రా ప్ర‌జావాణికి 46 ఫిర్యాదులు

— ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ హైడ్రాతోనే సాధ్యం
— ఖాళీ స్థ‌లాల్లో పార్కుల‌భివృద్ధికి విన్న‌పాలు

హైదరాబాద్, నవతరం: చెరువులు, నాలాలు, ప్ర‌భుత్వ భూములు, పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడి.. ప‌ర్యావ‌ర‌ణానికి ఊత‌మివ్వ‌డం హైడ్రాతోనే సాధ్య‌మ‌ని ప‌లువురు పేర్కొన్నారు. చెరువులు, నాలాల‌ను ప‌రిర‌క్షించి అనుసంధానం చేయాల‌ని అప్పుడే వ‌ర‌ద‌లు లేని న‌గ‌రం చూడ‌గ‌ల‌మ‌న్నారు. ఈ క్ర‌మంలో చెరువుల‌ను ప‌రిర‌క్షిస్తున్న హైడ్రా.. పార్కుల‌ను కూడా చేప‌ట్టాల‌ని ప‌లువురు కోరారు. లే ఔట్ల‌లో ప్ర‌జావస‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను పార్కులుగా అభివృద్ధి చేసి ప్రాణ‌వాయువును అందించాల‌ని ప‌లువురు హైడ్రా ప్ర‌జావాణిలో కోరారు. నివాసాల మ‌ధ్య కొద్ది మొత్తంలో ఉన్న ప్ర‌భుత్వ స్థ‌లాల‌కు కంచె వేసి.. పార్కులుగా అభివృద్ధి చేయాల‌ని డిమాండ్ చేశారు. నిజాంపేట‌లోని తుర్క చెరువు కింద ఉన్న ప్ర‌భుత్వ స్థ‌లాల‌కు కంచెవేసి పార్కులుగా తీర్చిదిద్దాల‌ని కోరారు. మేడ్చ‌ల్ జిల్లా కాప్రా మండ‌లం చిన్న చెర్ల‌ప‌ల్లిలోని వెంక‌ట రెడ్డి కాల‌నీలో పార్కు స్థ‌లం క‌బ్జాకు గురి అవుతోంద‌ని వెంట‌నే హైడ్రా జోక్యం చేసుకోవాల‌ని కోరారు. ఇలా సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 46 ఫిర్యాదులందాయి. ఈ ఫిర్యాదుల‌ను హైడ్రా క‌మిష‌నర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించి.. ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు. మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా మేడ్చ‌ల్ మండ‌లంలోని కండ్ల‌కోయ విలేజ్‌లో కోర్టు భ‌వ‌నం, ట్రాఫిక్ పోలీసు స్టేష‌న్‌, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యం నిర్మాణానికి ఉద్దేశించిన ప్ర‌భుత్వ భూమి ఇప్పుడు డంపింగ్ యార్డుగా మారిపోయింది. గుండ్ల పోచంప‌ల్లి మున్సిపాలిటీ వాళ్లే అక్క‌డ చెత్త వేసి త‌గులబెడుతున్నారు. దీంతో చుట్టుప‌క్క‌ల ఉన్న కాల‌నీ, అపార్టుమెంట్ వాసులు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. కొన్ని ఆసుప‌త్రుల నిర్వాహ‌కుల‌కు కూడా వ్య‌ర్థాలు అక్క‌డే ప‌డేస్తున్నారు. మా ప్రాంతాల‌న్నీ బోరు నీటి మీదే ఆధార‌ప‌డాల్సి ఉంది.. భూగ‌ర్భ‌జ‌లాలు క‌లుషిత‌మ‌వ్వ‌డ‌మే కాకుండా.. దుర్గంధం, పొగ‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు ఉద్దేశించిన స్థ‌లాన్ని కాపాడి.. అక్క‌డ మంచి వాతావ‌ర‌ణం ఏర్ప‌డేలా చూడాల‌ని స్థానికులు ప్ర‌జావాణికి ఫిర్యాదు చేశారు. రామంతాపూర్ పెద్ద చెరువులో త‌మ ప్లాట్లు మునిగిపోయాయ‌ని.. త‌మ‌కు భూమికి భూమి లేదా.. త‌గిన విధంగా న‌ష్ట ప‌రిహారం ఇప్పించాల‌ని అక్క‌డి నివాసితులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. 1958లో గ్రామ‌పంచాయ‌తీ లే ఔట్‌లో ప్లాట్లు తాము కొనుక్కున్నామ‌ని.. అదే లే ఔట్‌లో కొంత‌మంది ఇళ్లు క‌ట్టుకుని నివాసం ఉంటున్నార‌ని.. త‌మ ప్లాట్లు మాత్రం నీట మునిగాయ‌ని వాపోయారు. చెరువుకు బండ్ నిర్మించిన‌ప్పుడు కూడా కొన్ని ప్లాట్ల య‌జ‌మానుల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇస్తామ‌న్నారు. ఇప్ప‌టికీ ఇవ్వ‌లేద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. చెరువుల‌ను అభివృద్ధి చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తే.. తాము అడ్డు చెప్ప‌మ‌ని.. త‌మ ప్లాట్ల‌కు త‌గిన విధంగా న‌ష్ట‌ప‌రిహారం చెల్లించే ప‌నులు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండ‌లం కురుముల‌గూడ జ‌న్నారం కాల‌నీలో రాజీవ్ గృహ‌క‌ల్ప పేరుతో 16 బ్లాకులు నిర్మించారు. వంద‌లాది ప్లాట్లు ఉన్నాయి. ఇక్క‌డ కింద‌న ఉన్న వారు.. అపార్టుమెంట్ల ముందు, వెనుక పార్కింగ్ కోసం ఉద్దేశించిన స్థ‌లాల‌ను క‌లిపేసుకుని కొన్ని చోట్ల దుకాణాలు నిర్మించుకోగా.. మ‌రి కొంత‌మంది అద‌నంగా గ‌దులు నిర్మించుకుని కిరాయిల‌కు ఇచ్చుకుంటున్నార‌ని.. దీంతో త‌మ‌కు పార్కింగ్ సౌక‌ర్యం లేకుండా పోవ‌డమే కాకుండా.. రాక‌పోక‌ల‌కు కూడా ఇబ్బందిగా ప‌రిణ‌మించింద‌ని వాపోయారు. వెంట‌నే ఆ స్థ‌లాల‌ను ఖాళీ చేయించాల‌ని అక్క‌డి నివాసితులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు.

మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా బాచుప‌ల్లి మండ‌లం నిజాంపేట విలేజ్‌లో తుర్క చెరువుతో పాటు.. చెరువు క‌ట్ట క‌బ్జాల‌కు గురౌతోంది. చెరువు కింద ఉన్న మూడు చోట్ల ప్ర‌భుత్వ భూమి ఉండ‌గా.. వాటి చుట్టూ ప్లాట్లున్న బ‌డా నిర్మాణ సంస్థ‌లు.. ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను కూడా క‌లిపేసుకుని ప్ర‌హ‌రీలు నిర్మిస్తున్నాయ‌ని ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ప్ర‌భుత్వ భూమిని మిన‌హాయించి ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్టినా త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని.. ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం 10 గుంట‌లున్న ప్ర‌భుత్వ భూమిని ప్ర‌జావ‌స‌రాల‌కు వినియోగించాల‌ని.. చిన్న పార్కులు అభివృద్ధి చేయాల‌ని స్థానికులు కోరారు. అమీన్‌పూర్ పెద్ద చెరువు నుంచి బందం కొమ్ము చెరువుకు వెళ్లే వ‌ర‌ద కాలువ క‌బ్జాల‌కు గురౌతోంద‌ని అక్క‌డి స్థానికులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. కింద‌న నిర్మాణాలు చేప‌ట్టిన రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌లు నాలాను ఆక్ర‌మించి ప‌నులు చేప‌డుతున్నారని.. ఈ క‌బ్జాల‌పై నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్‌లో కేసులు కొన‌సాగుతుండ‌గా.. వివిధ సంస్థ‌లు అనుమ‌తులు ఇచ్చాయ‌ని.. ఒక‌సారి క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి నాలా ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించాల‌ని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ నాలా ఆక్ర‌మ‌ణ‌తో త‌మ ప్రాంతాల్లో వ‌ర‌ద నీరు నిలుస్తోంద‌ని వాపోయారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading