నవతరం

తెలుగు దినపత్రిక

సూపర్ మాక్స్ లో భారీ చోరీ

  • మూత పడ్డ సూపర్ మాక్స్ కంపెనీలో విలువైన యంత్రాలు మాయం
  • ఆందోళనలో సూపర్ మాక్స్ కార్మికులు..
  • జీడిమెట్ల పీఎస్ లో ఫిర్యాదు చేసిన కార్మిక నాయకులు
  • విలువ రూ 50 కోట్లకి పైగా ఉంటుందని ప్రాధమిక వెల్లడి

కుత్బుల్లాపూర్, నవతరం: జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని సూపర్ మాక్స్ పర్సనల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ లో కోట్ల రూపాయల విలువైన యంత్ర సామాగ్రి చోరీకి గురైందని, ఈ మేరకు కార్మికులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కార్మికులు ఫిర్యాదు చేశారు. ఈ పరిశ్రమ మూడేళ్ల క్రితం మూతపడిందని, ప్రస్తుతం ఎన్.సి.ఎల్.టి (నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్) పరిధిలో ఉందని, బ్లేడ్స్ తయారు చేసే యూనిట్ యంత్ర మిషినరీ లు మొత్తం మాయమైనట్టు కార్మికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. జీడిమెట్ల సిఐ గడ్డం మల్లేష్ ఆదేశాల మేరకు క్రైమ్ సిబ్బంది పరిశ్రమను కార్మికులతో కలిసి పరిశీలించారు. దాదాపు పది లారీల్లో పట్టే అంత యంత్రాలు మాయమైనట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కంపెనీలో యజమాన్యానికి కార్మికులకు మధ్య కోర్టులో వివాదం నడుస్తుంది. బకాయిలు చెల్లించాలని కార్మికులు లేబర్ కోర్టును  ఆశ్రయించారు. ఈ క్రమంలో విలువైన యంత్రాలు మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. కంపెనీ సెక్యూరిటీ కి తెలియకుండా యంత్రాలు బయటకు ఎలా వెళ్లాయని యూనియన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాగా కార్మికులు ఇచ్చిన ఫిర్యాదును అధికారికంగా తీసుకోవడానికి తమకు అనుమతి లేదని జీడిమెట్ల సిఐ గడ్డం మల్లేష్ తెలిపారు. ఎన్సిఎల్టి అధికారులు సోమవారం వచ్చి ఫిర్యాదు చేస్తామని తెలిపినట్టు పేర్కొన్నారు. మాయమైన యంత్రాల విలువ 50 కోట్లకు పైగా ఉంటుందని యూనియన్ జేఏసీ నాయకులు పేర్కొంటున్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading