Navatharam

Telugu Daily

బరితెగించిన కబ్జాదారులు

  • రాత్రిపూట జెసిబి లతో ప్రభుత్వ భూములను చదును చేస్తున్న వైనం
  • అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో అలసత్వం వహిస్తున్న రెవెన్యూ అధికారులు
  • కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న అవినీతి అక్రమార్కులకు అడ్డు కట్టపడేనా…?

కుత్బుల్లాపూర్ / మేడ్చల్ జిల్లా: గత దశాబ్ద కాలంగా ప్రభుత్వ భూములు మాయం చేస్తున్నా… సరైన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడటంలో విఫలమవుతున్నారు కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు. ఇప్పటికే కొన్ని ఎకరాల భూములు కబ్జాదారుల కబందహస్తాల్లోకి వెళ్లిపోయాయి. స్థానికంగా ఉన్న సామాజిక కార్యకర్తలు ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారుల మొద్దు నిద్ర మాత్రం వీడటం లేదు. రాత్రిపూట జెసిబి ల సహాయంతో ప్రభుత్వ భూములు చదును చేస్తూ… కొందరు అవినీతి రెవెన్యూ అధికారుల అండదండలు చూసుకుని కొన్ని కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు మాయం చేస్తున్నారు ఇక్కడి కేటుగాళ్లు. అయినా కూడా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు కొందరు అవినీతి అధికారులు. ఎప్పుడో ఒకసారి ఫిర్యాదులకు స్పందిస్తూ తూతూ మంత్రంగా కూల్చివేతలు చేస్తూ… పరోక్షంగా భూ కబ్జాదారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు ఇక్కడి రెవెన్యూ అధికారులు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం దేవేందర్ నగర్ లోని సర్వే నంబర్ 329/1 లోని ప్రభుత్వ భూముల్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలే. రాత్రిపూట జెసిబి లు పెట్టి… బండరాలను సైతం పిండి చేస్తూ… కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ… ప్రభుత్వ భూములు మాయం చేస్తున్నారు ఇక్కడి భూకబ్జాదారులు. ఇకనైనా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ భూములు అనేవే లేకుండా పోతాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలకు తీవ్ర అన్యాయం చేసిన వారవుతారు. దేవేందర్ నగర్ కట్ట మైసమ్మ బస్తీలో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించి, భూ కబ్జాదారుల పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Discover more from Navatharam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading