Navatharam

Telugu Daily

2023 ఎన్నికల్లో తెలంగాణలో నీలిజెండా ఎగురవేయాలి

  • రాజ్యసభ ఎంపి రాంజీ గౌతమ్

కామారెడ్డి, నమస్తే ఎల్లంపల్లి: జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… 70ఏళ్లుగా దొరలు పాలిస్తున్నరు అయినా మన బతుకులు మారలే, మనం వలసలు పోతూ, గుడిసెల్లో బతుకుతుంటే దొరలు మాత్రం ఫాంహౌస్ ల్లో బతుకుతున్నరు. బిజెపి వలే ఒక్కొక్కరికి 50 లక్షలిచ్చి ఎమ్మెల్యేలను కొని ముఖ్యమంత్రులు చేసే పార్టీ కాదు బిఎస్పి. సొంతంగా ఒక్క రూపాయి, మద్యం ఇవ్వకుండా సిఎం చేసేదే బిఎస్పి అన్నారు. మాయవతి ముఖ్యమంత్రిగా 7 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచింది. కెసిఆర్ వలే 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి 70 వేల ఎకరాల పేదల భూమి ఆక్రమించారు. ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఎన్నికల ఖర్చునంతా భరిస్తానని చెప్పిన కెసిఆర్ కు ఆ డబ్బంతా ఎక్కడిది అని ప్రశ్నించారు. ఏ కష్టం చేయకుండా ఇంత డబ్బు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు ఇవ్వలేదు కానీ, కెసిఆర్ మాత్రం 170 కోట్లతో 40 రూంలతో ఇళ్లు కట్టుకున్నారని ఆరోపించారు. ప్రగతిభవన్ లో 20 రకాల వంటకాలతో భోజనం చేసే కెసిఆర్ పేద పిల్లలకు మాత్రం కనీసం గుడ్లు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. 3 లక్షల కమీషన్ ఇస్తేనే దళితబంధు ఇస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన దళితబంధు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పనికి రాకుండా ఇళ్ల ముందు నిరుపయోగంగా ఉన్నాయని తెలిపారు. ట్రాక్టర్లు అన్ని పోచారం శ్రీనివాస్ రెడ్డి కి చెందిన షోరూం నుండి మాత్రమే తీసుకునేలా షరతులు పెట్టారని ఆరోపించారు. అంటే కమీషన్ల కోసమే దళితబంధు పెట్టారని ఆరోపించారు. పోలీసు కేసులకు భయపడవద్దని, మీ కోసం నేను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని కార్యకర్తలకు  భరోసా ఇచ్చారు. బిఎస్పి పాలనలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరం భూమి ఇచ్చి, మహిళల పేరుతో పట్టా ఇస్తామని, కెసిఆర్ వలే అమ్మకుండా 10 లక్షల ఉద్యోగాలిస్తామన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులన్ని పేదలకు ఇస్తామని, అంతర్జాతీయ ప్రమాణాలను విద్య, వైద్యం అందిస్తామని, బిసిలకు 60 నుండి 70 సీట్లు ఇస్తామని, అసైన్డ్, పోడు భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. రాజ్యసభ ఎంపి రాంజీ గౌతమ్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కెసిఆర్ బిఎస్పిని చూసి భయపడుతున్నారని, ఆయనకు నిద్ర కూడా పట్టడం లేదని పేర్కొన్నారు. పడుకుంటే కలలో కూడా ఏనుగు కనిపిస్తోందని తెలిపారు. అందుకే బిఎస్పి కార్యకర్తలకు భయపడి నిజాంసాగర్ మండల కార్యకర్తలకు దళితబంధు చెక్కులు పంచారని పేర్కొన్నారు. ఆ డబ్బులు కెసిఆర్ ఇంట్లో నుండి ఇవ్వలేదని, కాబట్టి దళితబంధు వచ్చినా ఓటు మాత్రం ఏనుగుకే వేయాలని సూచించారు. ప్రతి గ్రామానికి బహుజన వాదం తీసుకెళ్లాలని సూచించారు. వాడవాడకు అంబేడ్కర్, కాన్శీరాంల త్యాగాన్ని ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే 2023 ఎన్నికల్లో తెలంగాణలో నీలిజెండా ఎగురవేయాలన్నారు.

Discover more from Navatharam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading