* కేసులు కోర్ట్ ఆర్డర్లతో బెదిరింపులు
* ఎకరం భూమికోసం ఎన్నెన్నో మాయలు
* దొంగ డాక్యుమెంట్లు సృష్టించి సొంతం చేసుకోవాలని ప్రయత్నం
* మొబైల్ కోర్టును కూడా పక్కదారి
ములకలపల్లి, నమస్తే ఎల్లంపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం రాజాపురం గ్రామంలో ఎకరం భూమి వివాదంలో తుపాకీ చూపించి బెదిరించిన విషయంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అనాధాశ్రమం ముసుగులో ఎకరం భూమిని కాజేయాలని సాటి గిరిజనులను నమ్మించి మోసం చేసిన సదరు వ్యక్తి దొంగ దస్తావేజులు చూపించి గ్రామస్థులను మాత్రమే కాక రెవెన్యూ అధికారులను, మొబైల్ కోర్టును కూడా పక్కదారి పట్టించాడు. ఊకే రాజేంద్రప్రసాద్ పేరున రెవెన్యూ రికార్డులలో నమోదైన ఎకరం పట్టా భూమిని అనాధాశ్రం పేరిట కొన్నట్లుగా నిర్వాహకుడు మడివి వెంకటేశ్వర్లు అలియాస్ ఎలీషా దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆ భూమిని కొన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నాడు. 2006 ఆగష్టు నెల 22వ తారీఖున పదమూడు వేల రూపాయలకు ఎకరం భూమిని కొన్నట్లుగా యజమానికి తెలియకుండానే పది రూపాయల బాండ్ పేపర్ సృష్టించాడు. యజమాని సంతకాలు, సాక్షి సంతకాలు అన్ని ఫోర్జరీ చేసినవే. అంతేకాకుండా మడివి నాగేశ్వరరావు, మడివి వెంకటేశ్వర్లు పేరున కొన్నట్లుగా వ్రాయించిన ఈ కాగితంలో సాక్షి సంతకాలు చేసింది కూడా వీరిద్దరే. మరో సాక్షి అయిన గడ్డం ఆంద్రయ్య అనే వ్యక్తి ఈ భూమి గురించి తనకేమీ తెలియదని, ఆ సంతకం తనది కాదని చెప్తున్నాడు. ఆతరువాత 2016 మే నెల 23వ తారీఖుతో అదే పదమూడు వేల రూపాయలకు దొంగ సంతకాలతో యాభై రూపాయల బాండ్ పేపర్ సృష్టించాడు. పదేళ్లు గడిచినా భూమి విలువ పదమూడు వేల రూపాయలే ఉండడం విచిత్రం. అంతకంటే విచిత్రమైన విషయం ఏమిటంటే మరో మూడు నెలలు తరువాత అంటే 2016 ఆగష్టు 17వ తారీఖున అదే భూమిని కొన్నట్లుగా ఇరవై రూపాయల బాండ్ పేపర్ బయటకు వచ్చింది. కానీ ఈసారి భూమి రేటు కొంచెం పెంచి పాతిక వేల రూపాయలు చేశాడు. రాజాపురంలో భూమి కొన్నప్పుడు స్థానికులను సాక్షులుగా పిలవడం సర్వ సాధారణం. కానీ ఈ మూడు కాగితాల్లో సంతకాలు చేసినవాళ్లు స్థానికులే కాదు. పైగా సర్వే నంబరు 618/2 లో ఉన్న ఎకరం భూమికి ఒకవైపు మెయిన్ రోడ్డు ఉండగా మిగతా మూడువైపులా ఉన్న భూమి యాజమానుల సంతకాలు ఎక్కడా లేవు. కోయ ఇవాంజెలికల్ సోషల్ సర్వీస్ సొసైటి పేరున అనాధాశ్రమం ముసుగులో దాదాపు రెండు దశాబ్దాలుగా సాటి గిరిజనులనే మోసం చేస్తున్నాడు. దాతలు ఇచ్చే విరాళాలతో ఖరీదైన కార్లలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. దొంగ సంతకాలు, కొట్టివేతలతో ఒకే వ్యక్తి దగ్గర నుండి మూడుసార్లు భూమి కొన్నట్లుగా ఉన్న కాగితాలు చూసినప్పుడు అది ఎంతటి మోసమో ఎవ్వరికైనా అర్థమవుతుంది. కానీ రెవెన్యూ అధికారులకు ఇంకా ఈ విషయం అర్ధమైనట్లు లేదు. ఇంకోవైపు భూమి యజమాని అయిన ఊకే రాజేంద్రప్రసాద్ మరియు మరో తొమ్మిదిమంది పై కేసు నమోదు చేశారు ములకలపల్లి పోలీసులు. మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది కూడా ఇదే దొంగ దస్తావేజుల ఆధారంగా. కోయ ఇవాంజెలికల్ సోషల్ సర్వీస్ సొసైటి పేరుతో ఇప్పటి వరకు అనాధాశ్రమం నడిపించి కొత్తగా లవింగ్ హార్ట్స్ సోషల్ సర్వీస్ పేరుతో అనాధాశ్రమం ఉన్న భవనంలోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రైవేట్ పాఠశాలను ప్రారంభానికి కేవలం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ చూపించి గ్రామస్థులను మోసం చేస్తున్నాడు. దీనికోసం జిల్లా స్థాయి నాయకుల నుండి ఫోన్లు చేయించి అధికారులను బెదిరింపులకు గురి చేసినట్లు స్థానికులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే బాధితులు జిల్లా కలెక్టర్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన ఈ విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెడితే అమాయక గిరిజనులకు న్యాయం జరిగే అవకాశం ఉంది.
గడ్డం అంద్రయ్య, పాస్టర్ చండ్ర కుంట గ్రామం

రాజాపురంలో ని సర్వే నంబరు 618/2 లోని ఎకరం భూమి ఊకే రాజేంద్రప్రసాద్ కు చెందినదే. దాన్ని అమ్మినట్లుగా నాకు ఎప్పుడూ చెప్పలేదు. మడివి వెంకటేశ్వర్లు ఆ ఎకరం భూమిని కొనలేదు.అలాగే వారు చూపించే కాగితంలోని సాక్షి సంతకం నేను పెట్టలేదు. మిగతా వారి సంతకాలు కూడా ఫోర్జరీ చేసినవే. అసలు ఈ భూమికి సంబంధించి క్రయ విక్రయాలు జరిగినట్లు మాకెవ్వరికి తెలియదు. అనాథలకు సేవ చేస్తాననే నెపంతో ఎకరం భూమిని కాజేయాలని చూస్తున్నారు. ఉన్నతాధికారులు దీనిపై విచారణ చేస్తే నిజా నిజాలు బయటకు వస్తాయి.




































































































































































































































































































You must be logged in to post a comment.