- కోట్లలో దండుకుంటున్న ముఠా
- కబ్జాదారుల్లో సిండికేట్ వ్యవస్థ
- ఖాళీ ప్లాట్ కు ఒక రేటు, కట్టించి ఇస్తే మరో రేటు
- అవినీతి అధికారులే వీరికి అండదండ
- సంవత్సర కాలంలో మూడు వందల ఇండ్ల నిర్మాణం
- ప్రభుత్వ భూమి అని తెలిసినా చర్యలు శూన్యం
- కైసర్ నగర్లోని పినాకిని క్రషర్ మిషన్ భూములు మాయం
- ప్రైవేట్ వెంచర్ ను తలపిస్తున్న అక్రమ నిర్మాణాలు
- రాతపూర్వక ఫిర్యాదులు చేసినా పట్టించుకోరా..?
- జిల్లా కలెక్టర్ పర్యటన ఉత్తుత్తిదేనా
- ఫోటో షూట్ల కోసం కూల్చివేతలా..?
- నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏడ్చినట్టు చెయ్యండంటున్న రెవెన్యూ అధికారులు
- సుమారు పదెకరాలు మాయం చేసిన కబ్జాకోరులు
- ప్రభుత్వ భూములు కాపాడాలంటున్న ప్రజలు
మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజులరామారం పక్కనే వున్న కైసర్ నగర్ పినాకిని క్రషర్ మిషన్ భూములు, దానికి ఆనుకుని వున్న ప్రభుత్వ భూములు మాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు కొందరు కబ్జాదారులు. కైసర్ నగర్ – లాల్ సాహబ్ గూడ సరిహద్దుల్లో వున్న ఈ భూములపై కొందరు అక్రమార్కుల కన్ను పడింది. దీంతో గత మూడు సంవత్సరాల క్రితం ఎలాగోలా ఈ భూములను కబళించివేయాలనే పన్నాగం పన్నారు. అప్పట్లో ఇక్కడ వున్న రెవెన్యూ తహశీల్దార్ ఇక్కడి కబ్జాలపై ఉక్కుపాదం మోపడంతో కాలు గాలిన పిల్లిలా గిలగిలా కొట్టుకున్నారు ఈ అక్రమార్కులు. అప్పటి తహశీల్దార్ గౌతం కుమార్ వీరిపై కొన్ని కేసులు కూడా నమోదు చేశారు. దాంతో ఏం చేయాలో తెలియక గమ్మున ఉన్న వీరికి కొందరు అవినీతి అధికారులు తోడు కావటంతో గత సంవత్సర కాలం నుండి రెచ్చిపోయిన ఈ కబ్జాదారులు ఎన్ని ప్లాట్ లు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ కబ్జా భాగోతంలో ఎవరెవరున్నారు. ఎంత మేర ప్రభుత్వ భూమిని మాయం చేశారు. జిల్లా కలెక్టర్ పర్యటన మతలబేంటి.. అనే విషయాలతో ‘నమస్తే ఎల్లంపల్లి’ ప్రత్యేక కథనం మీ ముందుకు…
కుత్బుల్లాపూర్ / మేడ్చల్ జిల్లా, నమస్తే ఎల్లంపల్లి: మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజులరామారం పక్కనే వున్న కైసర్ నగర్లోని ‘పినాకిని క్రషర్ మిషన్’ భూములు, పక్కనే ఉన్న ఖాళీ జాగలను మాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు కొందరు కబ్జాదారులు. గత మూడు సంవత్సరాల క్రితం ఇక్కడి ప్రభుత్వ భూములపై కన్నేసిన ఓ కబ్జా ముఠా ప్రస్తుతం ఏకంగా మూడువందల అక్రమ నిర్మాణాలు చేసి తమ సత్తా చాటుకుంది. ఇదంతా కూడా స్థానిక రెవెన్యూ అధికారులకు తెలియదా అంటే.. అంతా తెలుసంటున్నారు స్థానిక ప్రజలు. కబ్జాదారుల చేతిలో పావులుగా మారిన రెవెన్యూ అధికారులు నామమాత్రపు కూల్చివేతలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు దండిగానే వున్నాయి. గత మూడు సంవత్సరాల క్రితం ఈ కబ్జాదారుల భరతం పట్టిన తహశీల్దార్ గౌతం కుమార్ మళ్ళీ రావాలంటూ స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఈ భూకబ్జాలను నియంత్రించడానికి మరో గౌతం కుమార్ రావాలంటూ బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు ఇక్కడి ప్రజలు. సామాన్య ప్రజలకు ఒక చట్టం, డబ్బులున్నవాడికో చట్టమా అంటూ మండిపడుతున్నారు ఇక్కడి జనం. కటిక పేదవాడు ప్రభుత్వ భూమిలో ఓ గుడిసె వేసుకుంటే సహించని రెవెన్యూ అధికారులు పట్టపగలు, అర్ధరాత్రిళ్ళు అనే తేడా లేకుండా రెవెన్యూ అధికారులను, జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం సవాలు చేస్తూ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా ఏమీ తెలియనట్లు నటిస్తున్న కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం ఓ థర్డ్ పార్టీ అధికారులను నియమించి వీరి అక్రమాల చిట్టా బయటకు తీయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ‘నామమాత్రపు కేసులు నమోదు చేస్తూ, కబ్జాదారుల వద్ద అందినకాడికి దండుకుంటూ, నామమాత్రపు కూల్చివేతలు చేస్తూ, తమ విధులను మర్చిపోవటమేనంటున్నారు’ స్థానిక ప్రజలు. పినాకిని క్రషర్ మిషన్ సమీపంలో వెలుస్తున్న నిర్మాణాలను చూసి అటువైపు ఎవరైనా వెళ్లాలని ప్రయత్నిస్తే.. అక్కడ ఉన్న కొందరు ప్రైవేట్ గూండాలు ‘మీరెవెరు, మీకేం కావాలి అని ఆరా తీస్తారు. వారికి అనుకూలంగా ఉండి సమాధానం చెబితే చాలు.. ఇక్కడ ఓపెన్ ప్లాట్ లు ఉన్నాయి. ఖాళీ ప్లాట్ అయితే పది లక్షలు.. రెవెన్యూ అధికారులను మీరే చూసుకోవాలి, లేదంటే అందులో ఒక ఇల్లు నిర్మించి ఇస్తాము పద్దెనిమిది ఇవ్వండి మేమే అంతా చూసుకుంటాము, మీ ఇల్లు కూలిపోతే మేమే బాధ్యత.. ఎన్ని సార్లు కూలితే అన్నీ సార్లు నిర్మించి ఇస్తాము. రెవెన్యూ అధికారులకు ఇచ్చేవి కూడా మేమే చూసుకుంటాము. నోటరీ పేపర్లు మాత్రం మా బినామీల పేర్లతో రాసి ఇస్తాము’ అంటూ అప్పటికే నిర్మించి ఉంచిన కొన్ని నిర్మాణాలను చూపిస్తారు. దీంతో సొంత ఇంటి కల వున్న మధ్యతరగతి ప్రజలు ఎంతోమంది వీరి ఉచ్చులో చిక్కుకుని మోసపోయారు. ఇక్కడి ప్లాట్ లను అమ్మడం ఒక వంతయితే.. అవే ప్లాట్ లను వేరేవారికి ఎక్కువ రేటుకు అమ్మి వారికి వారికి పంచాయితీలు పెట్టి మధ్యలో ఫాయిదా పొందటం వీరికి ఓ సరదా. ఇలా అందులోనూ లక్షలు దండుకుంటారు. దేవేందర్ నగర్ నుండి సాబేర్ నగర్ నుండి లాల్ సాహబ్ గూడ వెళ్ళే దారిలో వున్న ఈ ప్రభుత్వ భూములను ఆక్రమించి అందులో అరవై, ఎనభై గజాల ప్లాట్ లు ఏర్పాటు చేసి ఇప్పటికే సుమారు రెండు వందల ప్లాట్ లు అమ్ముకుని లక్షలు, కోట్లు దండుకున్నారు ఈ కబ్జాదారులు. అంతటితో ఆగకుండా పక్కనే వున్న ‘పినాకిని క్రషర్ మిషన్’ పూడ్చివేసి అందులోనూ అక్రమ నిర్మాణాలు చేపట్టారు సదరు కబ్జాదారులు. అందులోనూ సుమారు వంద ఇండ్లను అక్రమంగా నిర్మించారు. కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులకు సవాలుగా మారిన ఈ కబ్జాదారులపై ఎలాంటి చర్యలుంటాయోనంటూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు.
నిర్మాణాలు జరుగుతాయిలా..
స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి ఇక్కడి ప్రభుత్వ భూములపై కన్నేసి, వాటిని ప్లాట్ లుగా విభజించి మొదటగా ఒక్కో ప్లాట్ ను లక్ష, రెండు లక్షల రూపాయలు అమ్ముకుంటారు. అవి ఉంటాయో, పోతాయో తెలియక ప్లాట్ లను కొనుక్కున్న అమాయకులు అందులో చిన్న చిన్న ఇండ్లను ఏర్పాటు చేసుకుని స్వంత ఇంటి కల నెరవేరిందనుకుంటారు. ఇంతలోనే రెవెన్యూ అధికారులు వచ్చి మీరు ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇండ్లను నిర్మించారు. వీటిని కూల్చేస్తున్నామంటూ ఓ జేసీబీ పెట్టి వాటిని నేలమట్టం చేస్తారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే అంతా అయిపోతుంది. దీంతో ఏం చేయాలో తోచక లబొదిబోమంటూ స్థానిక ప్రజా ప్రతినిధుల వద్దకు పరుగులు తీస్తారు. వారు కూడా ఏం చేయాలో తెలియక అధికారులకు ఫోన్లు చేసి కరెంటు మీటర్లు వచ్చిన ఇండ్లను కూల్చకండంటూ ఆదేశాలు జారీ చేస్తారు. దీంతో ఇక్కడి ప్రభుత్వ భూముల్లో ఒకటో రెండో ఇండ్లు నిలబడతాయి. కూల్చివేతల సమయంలో అక్కడ నుండి జారుకున్న కబ్జాదారులు మళ్ళీ అక్కడ ప్రత్యక్షమవుతారు. అంతే.. అమ్మకాలు మళ్ళీ మొదలవుతాయి. ఇప్పుడు మాత్రం లక్షా, రెండు లక్షలు కాకుండా అయిదు, ఆరు లక్షలకు ఒక ప్లాట్ అంటూ కొంత రేటు పెంచి ప్లాట్ లు అమ్ముకుంటారు. మళ్ళీ అదే తంతు కొనసాగుతుంది. ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఒకడుగు ముందుకేసి వారివద్ద నుండి కొన్ని నోటరీ పత్రాలు సంపాదించి కొన్ని కేసులు నమోదు నమోదు చేస్తారు. వీధి నిర్వహణలో భాగంగా కొద్ది భాగమూ, సగ భాగమో కొన్ని నిర్మాణాల కూల్చివేతలు చేస్తారు. ఇప్పటివరకు కేసులంటే భయపడిన కబ్జాదారులు కొందరు దళారులను ఆసరాగా చేసుకుని కొందరు అవినీతి అధికారులకు ఆశ చూపించి, మీకు కొన్ని ప్లాట్ లు ఇస్తాము, కొంత సైడ్ అమౌంట్ ఇస్తాము అంటూ ఆశ చూపిస్తారు. ఆశ కు రుచి మరిగిన అవినీతి అధికారులు వారి కబ్జాలను చూసీ చూడనట్టు పోతారు. వారి ఆఫర్ లను తిప్పికొట్టే అధికారులు తమ విదులు తాము నిర్వహిస్తారు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఇక్కడి కబ్జాదారుల్లోనూ తెలివి పెరుగుతుంది. దీంతో ఎవరితో చెప్పించుకుంటే పనవుతుందో ఆలోచిస్తారు. అంతే.. దాని ఫలితమే ఇక్కడి మూడువందల అక్రమ నిర్మాణాలంటున్నారు స్థానిక ప్రజలు. ఈ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే సంబంధిత అధికారులు కొన్నింటిని కూల్చివేసి, ఆ ఫోటోలను ఫైల్ చేసి ఉన్నతాధికారులకు పంపుతారు. ఇక్కడి కబ్జాలపై స్పందించిన జిల్లా కలెక్టర్ గత కొద్ది రోజుల క్రితం దేవేందర్ నగర్ లోని కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని గుర్తించి ఫెన్సింగ్ వేయాలని స్థానిక రెవెన్యూ అధికారులకు సూచించారు. అయినా కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఆచరణకు నోచుకోవటం లేదంటే వ్యవస్థ ఎంత దారుణంగా తయారయ్యిందో ఇట్టే అర్థమవుతుంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా ఇక్కడి కబ్జాదారులు ‘పినాకిని క్రషర్ మిషన్’ భూములను మాయం చేసి కోట్లు దండుకుంటున్నారంటే వీరి ధైర్యం ఎంతటిదో అర్థమవుతుంది.


ప్రభుత్వ భూములు కాపాడండి
కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని గుర్తించి, ఆ భూములను భవిష్యత్ తరాల కొరకు కాపాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కబ్జాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్టులు నమోదు చేసి మళ్ళీ ఎవరూ కూడా ప్రభుత్వ భూముల జోలికి రాకుండా లాండ్ ప్రొటెక్షన్ కమిటీ సైతం చర్యలు తీసుకోవాలని కొందరు సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.




































































































































































































































































































You must be logged in to post a comment.