* అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం
హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: పీడితులు నూతన సామాజిక విప్లవానికి సిద్ధం అవ్వాలని అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కూకట్ పల్లి, ప్రకాష్ నగర్ లో అంబేద్కర్ ప్రజా సంఘం మేడ్చల్ జిల్లా ఇంచార్జీ చేగూరి మహేందర్ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కట్టెల మల్లేశం మాట్లాడుతూ కులాలు, మతాలకు అతీతంగా సమాన అవకాశాలు, హోదా, స్వేచ్ఛ, నమ్మకం, విశ్వాసాన్ని కలిగి ప్రజలందరూ కలిసి జీవించాలని రాజ్యాంగం ప్రబోధిస్తుందని అన్నారు. కానీ అందుకు విరుద్ధంగా త్రైవర్ణాల రాజ్యాధికార భావం పాలక పక్షంలో పెరగడంతో, పాలకులే రాజ్యాంగేతర శక్తులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పాదక శక్తిని, సామర్థ్యాన్ని ప్రజల్లో పెంపొందించడంతోపాటు సాంకేతిక విద్యకు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని రాజ్యాంగం సూచిస్తుంది అన్నారు. కానీ ఈరోజు నూటికి 85 శాతం గా ఉన్న ఎస్సీ, ఎస్టీ బీసీలను విద్యకు దూరం చేసే ప్రయత్నం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతుందని విమర్శించారు. తద్వారా ప్రజల్లో బతుకు భరోసా కోల్పోయి, అభద్రతా భావం చోటుచేసుకుందని అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి జీవన సూత్రాలు రాజ్యాంగం కల్పించడం ద్వారానే అందరూ కలిసి జీవించగల పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ఈ పరిస్థితులు స్థిరంగా నిలబడాలి అంటే మానవ మెదడులో నుండి మూఢత్వం తొలగిపోయి, ఈ దేశానికి శాస్త్రీయ జ్ఞానం తలమానికం కావాలని ఆకాంక్షించారు. దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, ఆర్థిక, సామాజిక దోపిడీ అంతం కావాలని అన్నారు. భూమి, వ్యాపారం, ఆర్థిక రంగాలలో సమానత్వం లభించడం లేదని, ఇప్పటికీ రిజర్వేషన్లు సరిగ్గా అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వ రంగాన్ని కొంతమందికి తాకట్టు పెట్టడం ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ట చేస్తుందని అన్నారు. అధికారికంగా అస్పృశ్యతా నివారణ జరిగినా, దళితులపై దాడులు జరగడం అమానుషం అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలోకి నెట్టి వేయబడుతుందని తెలిపారు. ఈ తరుణంలో కోల్పోయిన హక్కులను పొందటానికి అణచివేతకు గురవుతున్న వారంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. అప్పుడే రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరడానికి, అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా జీవించే అవకాశం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవరావు, నాయకులు దానియేలు, ప్రభు, వెంకట్, శ్రీనివాస్, మీడియా ప్రతినిధులు బుల్లెట్ రవి, రెహమాన్, షబ్బీర్, రవి, నాగార్జున, నాగరాజు, స్థానిక నాయకులు సాయి ప్రకాష్, బొట్టు రాజు, శివ, వర్షం, ఎం.క్రిష్ణ, ఎం.మహేష్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.























































































































































































































































































































You must be logged in to post a comment.