- ఏఐపీకేఎస్ జిల్లా సహాయ కార్యదర్శి వీరన్న
పెద్దవంగర, నమస్తే ఎల్లంపల్లి : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న అన్నారు. పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ బుధవారం ఆర్ఐ భూక్య లష్కర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. పంటలకు సరైన గితుబాటు ధర అందించేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని దానికోసం రైతాంగం బలమైన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అసలే పెట్టిన పెట్టుబడి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఎరువులపై సబ్సిడీ ఎత్తివేయడం మరింత భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆలోచనలు వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసేందుకు రైతులను అన్ని విధాల ప్రోత్సహించాలని సూచించారు. ఇప్పటికే వ్యవసాయరంగం సంక్షోభంలో నెట్టి వేయబడిందని, దేశంలో ఆర్థిక సంక్షోభం పెరిగిపోయిందన్నారు. రైతన్న వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ రైతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 60 సంవత్సరాల వయసు దాటిన రైతులకు నెలకు 5 వేల రూపాయల పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐ.ఎఫ్.టీ.యూ జిల్లా నాయకుడు చింత నవీన్, అఖిల భారత రైతు రైతు కూలీ సంఘం మండల అధ్యక్షుడు గుగులోతు పుల్ సింగ్, మండల నాయకులు ఈదురు బిక్షం, ఏదురి అప్పయ్య, వెంకన్న, గద్దల రామకృష్ణ పాల్గొన్నారు.





































































































































































































































































































You must be logged in to post a comment.