* దోపిడీ స్కాంల ప్రభుత్వాన్ని గద్దె దించాలి
* రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో బిజెపి, బిఆర్ఎస్
* పెద్దపల్లిలో ఇసుకమాఫియా పెరిగింది
* లిక్కర్ స్కాంపై శ్వేతపత్రం విడుదల చేయాలి
* డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు
బహుజన్ సమాజ్ పార్టీ
పెద్దపల్లి, నమస్తే ఎల్లంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో పాలిస్తున్న దోపిడీ స్కాంల ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాలని డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 150వ రోజు యాత్ర పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓదెల మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో దోపిడి పెరిగిందన్నారు. ధరణి పోర్టల్ తీసుకువచ్చి సమస్యలు సృష్టించారని తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని స్లాట్ బుక్ చేసుకుంటే వేలకు వేలు ఫీజు కట్టాల్సి వస్తుందని, స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే మన ఫీజు వాపస్ ఇవ్వడం లేదని, ప్రభుత్వం ఈ విధంగా ప్రజలను పీల్చి పిప్పి చేస్తుందని, ఆదాయం పెంచుకుంటుందని ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్ తీసుకువచ్చిందే భూముల కబ్జా కోసం అని విమర్శించారు. బహుజన రాజ్యంలో ధరణి పోర్టల్ తొలగిస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లిలోని ఓదెల మండలం లంబాడతండాలో వంద ఎకరాల భూమి ధరణిలో చూపించడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కవిత లిక్కర్ స్కాం పై పూర్తి వివరాలు బయటపెట్టాలని, శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వందకోట్లు ఎలా వచ్చాయి,సెల్ ఫోన్ ఎందుకు ధ్వంసం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆప్, బిఆర్ఎస్ కలిసి లిక్కర్ మాఫియా నడుపుతున్నారని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని తొలగించి, పేదల హక్కులను కాలరాయాలని చూస్తుందని పేర్కొన్నారు. మైనారిటీలకు ఓటు హక్కు తీసేసే కుట్ర జరుగుతుందని తెలిపారు. తెలంగాణ సిఎం కెసిఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారని గుర్తుచేశారు. రాజ్యాంగం తీసేస్తే మనకు హక్కులుండవని, అందుకే బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే రాజ్యాంగాన్ని కాపాడడం కోసం కృషి చేస్తుందని తెలిపారు. రాజ్యసభలో కేంద్రమంత్రి స్వయంగా రిజర్వేషన్లు పెంచుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని చెబుతుంటే, తెలంగాణ ప్రభుత్వం బిసి,ఎస్సీ,ఎస్టీ మైనారిటీల రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ఓదెల మండలంలో ఇసుక మాఫియా పెరిగిందని, దానివల్ల రోడ్లు పాడైపోయి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలకు రైల్వే ట్రాక్ వల్ల ఎమర్జెన్సీ సమయంలో ఇబ్బందులు పడుతున్నారని, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, వెంటనే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎస్ఆర్ఎస్ పి కాలువ నీళ్లు ప్రతి గ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోలీస్ నియామకాల్లో లాంగ్ జంప్ 3.8 మీటర్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆసరా ఫించన్ల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, మిషన్ భగీరథ నల్లాల గుండా కలుషిత నీరు వస్తుందని మండిపడ్డారు. యాత్రలో భాగంగా కొత్తపల్లి గ్రామ శివారులోని హమాలీలు, నాట్లు వేసే మహిళలను కలిసి బహుజన రాజ్యం గురించి వివరించారు. బహుజన రాజ్యంలో పేదలందరికీ సమానంగా సంపద పంచుతామని, సమాన అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి హనుమయ్య, నియోజకవర్గ ఇంచార్జి దాసరి. ఉష, జిల్లా అధ్యక్షులు దుర్గయ్య, జిల్లా మహిళా కన్వీనర్ స్వప్నగౌడ్,నియోజకవర్గ నాయకురాలు శారద తదితరులు పాల్గొన్నారు.


































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.