నవతరం

తెలుగు దినపత్రిక

పేదల సొమ్ముతో బిఆర్ఎస్ సభ

* బండి సంజయ్ కి కౌన్సిలింగ్ ఇవ్వాలి
* బిజెపి సచ్చేదిన్ పాలనకు శాంపిల్
* డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ.

కొడిమ్యాల / చొప్పదండి / జగిత్యాల, నమస్తే ఎల్లంపల్లి: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమారుడు మహేంద్ర యూనివర్సిటీలో తోటి విద్యార్థిపై చేసిన దాడిని డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. కుమారుడి దాడిని ఖండించాల్సింది పోయి వెనకేసుకొస్తున్న బండి సంజయ్ కి కౌన్సిలింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిల్లలను ఎలా పెంచాలో చెప్పాలని విమర్శించారు. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వస్తే పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక శాంపిల్ మాత్రమేనన్నారు. వెంటనే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్, బిజెపి చీకటి ఒప్పందం చేసుకున్నాయని అందుకే ఆరోపణలు వచ్చినా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయలేదన్నారు. 300ల రోజుల బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా నేడు 167వ రోజు చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు ఖమ్మంలో జరిగే సభ పేదల సొమ్ముతోనే నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ, కేరళ, పంజాబ్ సిఎంలను పిలిచి మీటింగ్ పెడితే తెలంగాణ ప్రజల కన్నీళ్ల ఆగవన్నారు. పేదల భూములు లాక్కొని, పేదల కష్టాన్ని దోచుకొని వచ్చిన సొమ్ముతో మీటింగ్ పెడుతున్నారని విమర్శించారు. ధరణిని అడ్డు పెట్టుకొని హైటెక్ సిటి నుండి గ్రామీణ ప్రాంతాల వరకు ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా చేస్తున్నారని గుర్తు చేశారు. ఆ సొమ్ముతోనే నేడు 17 రకాల వంటకాలతో విందు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఆస్తినంతా ఖర్చు చేస్తున్నారని గుర్తుచేశారు. కానీ బిఎస్పి పేదల భూములను కాపపాడుతుందని ఒక్క ఇంచుకూడా ప్రభుత్వానికి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యార్థుల చదువుకోసం ఇవ్వాల్సిన రియంబర్స్ మెంట్ ఎందుకివ్వడం లేదని మండిపడ్డారు. ఇప్పటివరకు 5 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని విద్యార్థులు ఫీజులు కట్టలేక చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. బిసి రిజర్వేషన్లు పెంచే బిల్లును రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించాలని డిమాండ్ చేశారు. 52 శాతం ఉన్న బిసిలకు కేవలం 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అన్యాయమన్నారు. యాత్రలో భాగంగా 2018లో కొండగట్టు బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం ఇప్పటివరకు వారిని కనీసం పరామర్శించకపోవడం దారుణమన్నారు. బాధితులకు భూమి, ఉద్యోగం, ఇల్లు కట్టిస్తామని చెప్పి మోసం చేశారని తెలిపారు. నాచుపల్లిలో పేదలకు ఇచ్చిన ఎనిమిది ఎకరాల భూమిని పరిశీలించారు. 30 ఏళ్ల క్రితం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇపుడు మళ్లీ లాక్కుంటున్నారని, అడిగితే కేసులు పెడుతూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు,పోలీసులు ప్రజల భూమిని ప్రజలకు ఇవ్వాలని పేర్కొన్నారు. పాలకుల ఫౌంహౌస్ లకు ఉన్నట్లుగా గ్రామాలకు రోడ్లు ఎందుకు లేవని ప్రశ్నించారు. గ్రామగ్రామాన బిఎస్పి బలపడడాన్ని బిఆర్ఎస్,బిజెపి పార్టీలు జీర్ణించుకోవడం లేదన్నారు. అందుకే బిఎస్పి కార్యకర్తలను బెదిరిస్తున్నారని తెలిపారు. మా కార్యకర్తలను బెదిరిస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని హెచ్చరించారు. యాత్ర నాచుపల్లి, తుమ్మలపల్లి, శనివారంపేట, కోనాపూర్, సూరంపేట, కొడిమ్యాల గ్రామాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జీ చిర్ర శంకర్, జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్, నియోజకవర్గ అధ్యక్షులు మాంకాలి తిరుపతి, నియోజకవర్గ ఇంచార్జి మంద రవీందర్, కొంకటి శేఖర్, మహిళా జోనల్ కన్వీనర్ స్వరూప, జిల్లా నాయకురాలు స్వప్న, నియోజకవర్గ నాయకురాలు అనూష తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading